బిగ్ బ్రేకింగ్.. కేసీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట
Telangana High Court:తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావుకు ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ నివేదికను నిలిపి వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు తెలిపింది. సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వకుండా..ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, కమిషన్ నియామకం చట్టబద్దమే అంటూ స్పష్టం చేసింది.
జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ ఏకపక్షంగా సాగిందని, తమ వివరణ పరిగణనలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ వివరాలను మీడియాకు లీక్ చేస్తోందని, అందుకే ఈ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు పిటీషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపి వేస్తూ బుధవారం తీర్పునిచ్చింది.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ-డిజైన్ చేసి కాళేశ్వరం నిర్మించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బ్యారేజీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ జరిపిన కమిషన్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నిపుణుల సలహాలు లేకుంగా కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారని.. ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగడం, క్వాలిటీ కంట్రోల్ లోపించినట్లు ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకం జీవో సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషి తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని పిటిషనర్లు పేర్కొన్నారు. తమపై అభియోగాలు మోపే ముందు, తమ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. ముఖ్య న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విని మార్చి 12న తీర్పును రిజర్వు చేసింది. ఈ నెల 8న తీర్పు వెలువరించాల్సి ఉన్నప్పటికీ, తీర్పు ప్రతి సిద్ధం కాకపోవడంతో కోర్టు దానిని ఏప్రిల్ 22కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఉత్కంఠ రేపిన తీర్పు నేపథ్యంలో, హైకోర్టు ప్రాంగణంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.