వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం

- ఈ సీజన్ లో 8 మంది మృతి
- దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఉమ్మడి జిల్లా 10వ స్థానం
- ఏప్రిల్‌లోనే మే స్థాయిలో దంచుతున్న ఎండలు
- పలు జిల్లాల్లో భయపెడుతున్న వడగాలులు
- రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం

Heat Waves In Telangana:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అప్పుడే మే నెల వచ్చేసిందా అన్నట్లు చుక్కలు చూపిస్తున్నాయి. పగపట్టాడేమో అన్నట్లు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు, వడగాలుల తీవ్రతకు ఈ సీజన్ లో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోవడం సూర్యుడి ఉగ్ర రూపానికి అద్దం పడుతోంది. ఎండల తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, ఆరు బయట పని చేసే నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు అల్లాడిపోతున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో ఏప్రిల్‌ మొదటి వారం నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మే నెలలో నమోదుకావాల్సిన స్థాయిలో ఇప్పుడే ఎండల తీవ్రత నమోదవుతోంది. అదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఓ వైపు వేడి ఉక్కపోతతో పాటు వడగాడుపులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సతమతం అవుతున్నారు. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లా 10 వ స్థానంలో ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ లో 46 డిగ్రీలు, అదిలాబాద్ జిల్లా సాత్నలలో 45.6 డిగ్రీలు, కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ లో 45.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కొమ్మర లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండల తీవ్రతకు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి ఉగ్రరూపం ప్రారంభం అవుతుండగా ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత క్రమంగా పెరిగిపోతూ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి.

ఆరు బయట పని చేసే నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, ట్రాఫిక్‌ పోలీసులు, రోడ్లపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇక ఇంట్లో ఉన్నా తీవ్ర ఉక్కపోత ప్రజలను అల్లాడిస్తోంది. ఫ్యాన్లు ఉన్నా వేడిగాలి సరేసరి. కూలర్లు, ఏసీలు ఉంటేనే ఉపశమనం కల్గే పరిస్థితి. ఆ సదుపాయాలు లేని పేదల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఉన్న వారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక సింగరేణి ప్రాంతాల్లో ఈ తీవ్రత మరింతగా ఉంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికుల గైర్హాజరు పెరిగిపోతుండటంతో ఉత్పత్తి పై ప్రభావం పడుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like