కూలిన చివ‌రి కోట…

Kerala Result LDF: అర్ధ‌శ‌తాబ్దం పాటు దేశ రాజకీయాల్లో కీల‌క పాత్ర పోషించిన క‌మ్యూనిస్టుల చ‌రిత్ర ఇక గ‌త చ‌రిత్రేనా..? ఆ జాతీయ పార్టీ ఇక క‌నుమ‌రుగేనా…? మ‌ళ్లీ పుంజుకుని తిరిగి అధికారంలోకి రావ‌డం అసాధ్య‌మేనా..? ఇలా ఎన్నో స‌మాధానాలు లేని ప్ర‌శ్న‌లు…

ఒక‌ప్పుడు దేశ‌గ‌తిని మార్చిన వామ‌ప‌క్ష పార్టీలు ఇప్పుడు ఉనికి కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ద‌య‌నీయ స్థితికి చేరుకున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. తాజాగా వెల్లడైన ఫలితాల తర్వాత దేశంలో 50 ఏళ్ల తర్వాత తొలిసారి క‌మ్యూనిస్టు పార్టీ పూర్తిగా అధికారానికి దూరమయ్యింది. పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) కేరళలో అధికారాన్ని కోల్పోవ‌డంతో 1970 తర్వాత భారతదేశంలో కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకపోవడం మొదటిసారి అయ్యింది.

ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలారు..
భారతదేశ రాజకీయాల్లో వామపక్షాలకు చాలా గొప్ప చరిత్ర ఉంది. 1951-52లో దేశంలో తొలిసారి పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీలలో అత్యధిక స్థానాలు సాధించింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానే. ఆపై ఐదేళ్ల తర్వాత, 1957లో కేరళలో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వామపక్ష పార్టీలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. 1977లో పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం) విజయం సాధించడమే కాకుండా.. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన రికార్డు సాధించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిబసు 23 ఏళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు. 2000లో బుద్ధదేవ్ భట్టాచార్యకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 11 ఏళ్ల పాటు బెంగాల్‌ను వామపక్షాలు పాలించాయి.

కొన‌సాగిన వామ‌ప‌క్షాల ప‌త‌నం..
త్రిపురలో కూడా వామపక్షాలు సుదీర్ఘకాలం తిరుగులేని విజయాన్ని సాధించి అధికారంలో కొనసాగాయి. 1993లో త్రిపురలో అధికారంలోకి వచ్చిన సీపీఐ(ఎం), 60 స్థానాల అసెంబ్లీలో ఒంటరిగానే 44 స్థానాలను గెలుచుకుంది. 1998 వరకు దశరథ్ దేబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత మాణిక్ సర్కార్ ఆ బాధ్యతలు చేపట్టి 20 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు. దేశ రాజకీయాల్లో వామపక్షాల పతనం ఎప్పుడో ప్రారంభమైనా.. 2011 నుండి అది తీవ్రతరమైంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీలో.. వామపక్షాలు కేవలం 62 స్థానాలకు పరిమితమయ్యాయి.

త్రిపుర, కేర‌ళ నుంచి అవుట్‌..
లెఫ్ట్ ఫ్రంట్ కోట అయిన త్రిపురను 2018లో బీజేపీ కైవసం చేసుకోవడంతో.. వామపక్షాలు పూర్తిగా తమ ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ ఎన్నికల్లో 60 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 36 స్థానాలను గెలుచుకోగా, కమ్యూనిస్టుల సంఖ్య 50 నుండి కేవలం 16కి పడిపోయింది. ఈ నేప‌థ్యంలో వామపక్షాలకు కేరళ ఒక్కటే ఊరటనిచ్చింది. 2016లో పినరయి విజయన్ నేతృత్వంలో అధికారంలోకి రావడమే కాకుండా, ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే కేరళ సంప్రదాయాన్ని కాదని.. తిరిగి 2021లో మళ్లీ విజయన్ విజయం సాధించారు.

కనుమరుగవుతున్న ఎర్రజెండా
తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేరళలో కూడా వామపక్షాలు ఓటమి పాల‌య్యాయి. కేరళలోని 140 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, వామపక్షాలు కేవలం 35 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నాయి. దీనితో లెఫ్ట్ కూటమి కేరళలో కూడా అధికారాన్ని కోల్పోయింది. 50 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారి అన్ని రాష్ట్రాల్లో వామపక్షాలు అధికారాన్ని కోల్పోయినట్ల‌య్యింది. ప్ర‌స్తుతం లోక్‌స‌భ‌లో సీపీఐ, సీపీఎంల‌కు ఆరుగురు ఎంపీలు మాత్ర‌మే ఉండ‌గా, అందులో న‌లుగురు త‌మిళ‌నాడులో డీఎంకే మ‌ద్ద‌తుతో గెల‌వ‌గా, ఒక‌రు రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో గెలిచిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like