రోడ్డెక్కిన రైతులు
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక చోట వారు నిరసనకు దిగుతూనే ఉన్నారు. తాజాగా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామం వద్ద రైతుల ఆందోళనకు దిగారు. తమ వడ్లు కళ్లాల్లోనే ఉంటున్నాయని, వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు ఆలస్యంగా జరుగుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దవుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళనకు దిగారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలలో నింపి తూకం వేస్తున్నప్పుడు భారీగా తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు రాజీవ్ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తుననిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు సముదాయించి అక్కడి నుండి ఆందోళన విరమింప చేశారు.