అర్ధరాత్రి అంతర్ జిల్లా చెక్ పోస్ట్ తనిఖీ
బక్రీద్ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు, తాండూరు మండలం రేపల్లె వాడ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును అర్ధరాత్రి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి వాహన వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.
ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద రవాణా ఉంటే స్థానిక పోలీస్ వారికీ, 100కు కాల్ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని,భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. డీసీపీ వెంట తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, తాండూర్ ఎస్ ఐ ప్రసాద్ ఉన్నారు.