కొండ‌గట్టులో కన్నుల పండువ‌గా హనుమాన్ జయంతి వేడుక‌లు

Kondagattu Anjaneya Swamy Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండ‌గట్టు శ్రీ ఆంజ‌నేయ స్వామి దేవాల‌యం (Kondagattu Anjaneya Swamy Temple)లో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున స్వామి వారికి అర్చకులు సీతమ్మ బావి నుంచి తెచ్చిన పవిత్ర జలంతో స్వామివారికి అభిషేకం చేశారు. ప్రత్యేక యజ్ఞాలు, హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. అభిషేకాలు నిర్వహించిన అనంతరం లక్ష పూలతో పాటు వివిధ ఫలాలతో మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ దివ్య అలంకరణను దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. 41 రోజుల కఠిన దీక్షలు ఆచరించిన స్వాములు, పెద్ద సంఖ్యలో కొండగట్టుకు చేరుకుని ఇరుముడులు సమర్పించి, మాల విరమణ చేస్తున్నారు. ఆలయం అంతా భక్తి గీతాలు, జై శ్రీరాం నినాదాలతో మార్మోగింది.

కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుండి భక్తులు పాదయాత్రగా తరలివచ్చారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు (మే 10-12) సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి తర్వాత ఆలయాన్ని సందర్శించి పరిస్థితి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులకు పలు సూచనలు చేశారు.

You might also like