న‌కిలీ విత్త‌నాల‌పై ఖాకీల ఉక్కుపాదం

Police iron grip on fake seeds:మంచిర్యాల జిల్లాలో పోలీసులు న‌కిలీ ప‌త్తివిత్త‌నాల‌పై ఉక్కు పాదం మోపుతున్నారు. ప్ర‌తీ ఏటా రైతుల‌ను మోసం చేస్తున్న వ్యాపారులు ఈ న‌కిలీ విత్త‌నాలు అంట‌గ‌డుతున్నారు. బీటీ 3 విత్తితే అధిక దిగుబ‌డి వ‌స్తుంద‌ని గ‌డ్డి మందు కొడితే స‌రిపోతుంద‌ని రైతుల‌కు వీటిని అమ్మేస్తున్నారు. దీని వ‌ల్ల రైతులు నానా ఇబ్బందులు ప‌డ‌క త‌ప్ప‌డం లేదు. అయితే, ఈ ఏడాది న‌కిలీ ప‌త్తి విత్త‌నాల‌పై ఖాకీలు ఉక్కుపాదం మోపారు. ఎక్క‌డిక‌క్క‌డ దాడులు చేస్తూ విత్త‌నాలు అమ్ముతున్న వారిని జైలుకు పంపుతున్నారు.

తాజాగా, మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు ప‌ట్టుకున్నారు. రెండు చోట్ల నిర్వ‌హించిన దాడుల్లో ప‌త్తివిత్త‌నాలు స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు ప‌లువురిని అరెస్టు చేసి రిమాండ్ సైతం త‌ర‌లించారు. చెన్నూరు పోలీసులు చేసిన దాడిలో ముగ్గురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకోవ‌డంతో పాటు వారి వ‌ద్ద రూ. 1.82 ల‌క్ష‌ల విలువైన‌ 70 కిలోల ప‌త్తి విత్త‌నాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో భీమిని మండలం మల్లిడికి చెందిన ఇందూరి పెంటయ్య, చెన్నూరు మండ‌లం సుబ్బారం ప‌ల్లెకు చెందిన సాయిని ర‌మేష్‌, చెన్నూర్, గెర్రేకాలనీకి చెందిన‌ వెన్నపురెడ్డి మల్లారెడ్డిని అరెస్టు చేశారు.

ఇక మ‌రో ఘ‌ట‌న‌లో భీమారం ఎస్‌ఐ రాజేందర్, మండల వ్యవసాయ అధికారి సుధాకర్ క‌లిసి ఇప్పల బోగడలో న‌కిలీ విత్త‌నాలు అమ్ముతున్నార‌న్న స‌మాచారం మేర‌కు దాడులు నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న‌లో పెనుకుల రవి అనే వ్య‌క్తి ఇంట్లో దాచిన రూ. 9. 48 ల‌క్ష‌ల విలువైన 316 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలను తరలిస్తున్నట్లు గానీ, గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు గానీ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెల‌పాల‌ని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన భీమారం ఎస్‌ఐ ఏ. రాజేందర్,పోలీసు సిబ్బంది పి.మల్లయ్య (హెడ్ కానిస్టేబుల్), కానిస్టేబుళ్లు కె. రమేష్,ఎన్. మహేందర్, జయకృష్ణ, అశోక్,హోమ్‌గార్డులు సదాశివ్,సంతోష్, శ్యామ్‌లను అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like