పాకిస్థాన్‌కు గుర్తొచ్చిన హిందూ చరిత్ర..!
పాకిస్థాన్‌లో దాదాపు 80 ఏళ్ల తర్వాత పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లను తిరిగి పునరుద్దరిస్తున్నారు. లాహోర్ నగరంలో ఇస్లామిక్ పేర్లతో ఉన్న సైన్‌బోర్డులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. వాటి స్థానంలో విభజనకు పూర్వం ఉన్న హిందూ, సిక్కు, జైన్ సంస్కృతులను ప్రతిబింబించే పాత పేర్లు తిరిగి దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్, ప్రపంచ దేశాల ముందు తన కఠిన ఇస్లామిక్ దేశం అనే ముద్రను చెరిపేసి, ఒక ఉదారవాద, సహనశీల దేశంగా చూపించుకోవడానికి ఈ మార్పులు చేస్తోంది.
ఈ పేరు మార్పుల ప్రక్రియ రెండు నెలలుగా అత్యంత వేగంగా సాగుతోంది. ఇప్పటికే కనీసం తొమ్మిది ప్రధాన ప్రాంతాల పేర్లను ప్రభుత్వం అధికారికంగా మార్చేసింది. 1990లలో భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం పాక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు వ్యక్తమైన తరుణంలో లాహోర్‌లోని ప్రసిద్ధ జైన్ మందిర్ చౌక్ పేరును బాబ్రీ మసీద్ చౌక్ గా మార్చారు. ఇప్పుడు మళ్లీ జైన్ మందిర్ చౌక్ గా పునరుద్ధరించారు. అలాగే ఇస్లాంపురగా మారిన ప్రాంతం మళ్లీ కృష్ణ నగర్ అయింది. రహమాన్ గలీ మళ్లీ రామ్ గలీ గా, సున్నత్ నగర్ ప్రాంతం సంత్ నగర్ గా మారాయి. మౌలానా జఫర్ అలీ ఖాన్ చౌక్ సైన్‌బోర్డు స్థానంలో మళ్లీ పాత లక్ష్మీ చౌక్ వెలిసింది.
చరిత్ర చెరిపివేయడం వల్ల తాము సాంస్కృతికంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఎంత నష్టపోయామో పాక్ పాలకులు ఆలస్యంగా గ్రహించారు. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు రావాలన్నా, విదేశీ పెట్టుబడిదారులు దేశంలోకి అడుగుపెట్టాలన్నా పాకిస్తాన్ తనపై ఉన్న ఉగ్రవాద, తీవ్రవాద ముద్రను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరప్ దేశాల తరహాలో హెరిటేజ్ టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే పాక్ ప్రభుత్వ అసలు వ్యూహం. భారతదేశం , ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, సిక్కు పర్యాటకులను ఆకర్షించడం ద్వారా కుప్పకూలుతున్న తమ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ఊదాలని భావిస్తున్నారు.
హిందూ, సిక్కు పేర్ల పునరుద్ధరణ అంటే పాకిస్తాన్ ఇస్లామిక్ శక్తులు, కరడుగట్టిన తీవ్రవాద సంస్థల నుంచి వ్యతిరేకత రావాలి. కానీ, ఏ ఒక్క ఉగ్రవాద లేదా మత సంస్థ కూడా వ్యతిరేకించలేదు. అక్కడి ప్రజలు కూడా అనధికారికంగా దశాబ్దాలుగా ఈ పాత పేర్లనే వాడుతుండటంతో ప్రభుత్వ నిర్ణయానికి పెద్దగా అడ్డంకులు ఎదురుకాలేదు. లాహోర్‌లో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని త్వరలోనే సింధ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు పాక్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మళ్లీ పాత పేర్లు పెడుతున్న ప్రాంతాల జాబితా ఇదే..
ఇస్లామిక్ పేరు పునరుద్ధరించిన పేరు
1. సున్నత్ నగర్ – సంత్ నగర్
2. మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ – లక్ష్మీ చౌక్
3. ముస్తఫాబాద్ – ధరంపుర
4. సర్ ఆగా ఖాన్ కూడలి – డేవిస్ రోడ్డు
5. అల్లామా ఇక్బాల్ రోడ్డు – జైలు రోడ్డు
6. ఫాతిమా జిన్నా రోడ్డు – క్వీన్స్ రోడ్డు
7.బాగ్-ఎ-జిన్నా – లారెన్స్ గార్డెన్స్
8. ఇస్లాంపుర – కృష్ణ నగర్
9. హమీద్ నిజామీ రోడ్డు – టెంపుల్ స్ట్రీట్
10. నిష్టర్ రోడ్ – బ్రాండ్రెత్ రోడ్
11. రెహమాన్ గల్లీ – రామ్ గల్లీ
12. బాబ్రీ మసీద్ చౌక్ – జైన్ మందిర్ రోడ్
13. ఘజియాబాద్ – కుమ్హర్‌పురా
14. జీలానీ రోడ్ – అవుట్‌ఫాల్ రోడ్
15. షహరా-ఇ-అబ్దుల్ హమీద్ బిన్ – బదీస్ ఎంప్రెస్ రోడ్