ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు
డీజీపీ ఎదుట లొంగిపోయిన నరహరి దంపతులు..
Maoist Narahari : మావోయిస్టు పార్టీకి ఊహించని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తన భార్య తన భార్య మేదర దానమ్మ అలియాస్ లత అలియాస్ పూనమ్ అలియాస్ బోజాతో కలిసి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయారు.
వాస్తవానికి మే 12న పోలీసుల ఎదుట నరహరి, ఆయన భార్య లొంగిపోయారు. పోలీసులు వారిని ఈ రోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. 2026, మార్చి 31నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ సందర్భంగా వందల సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అలాగే పలువురిని అరెస్ట్ చేశారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు నిరంతరాయంగా చేపట్టిన కూంబింగ్ కారణంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.
ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాల పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పని చేశారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 47 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. అందులో తెలంగాణకి చెందిన వారు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఒకరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు 15, జార్ఖండ్ 13, ఒడిశాకు చెందిన 15 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని వివరించారు. 2024 నుండి ఇప్పటి వరకు 822 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మొత్తం 334 మంది తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారని చెప్పారు. మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టులను త్వరలో వారి ప్రాంతాలకు వెళ్లి స్వయంగా కలుస్తానని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
తెలంగాణకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ గణపతితోపాటు జాడే రత్న బాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు లొంగిపోవాలని ఈ సందర్భంగా వారికి డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. మీరు లొంగిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న గణపతి, జాడే రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన నరహరిపై రూ.25 లక్షలు, ఆయన భార్య దానమ్మపై రూ.20 లక్షల రివార్డు ఉండగా.. ఆయా మొత్తాల చెక్కులను డీజీపీ వారికి అందజేశారు.
ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ.. “సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ కి నా కృతజ్ఞతలు. జార్ఖండ్, తెలంగాణ, మిగతా ప్రాంతాల్లో పోరాట పరంగా అనేక నష్టాలు చూశాం. మావోల సాయుధ పోరాటం కష్టంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశాల కారణంగా ప్రజా జీవితంలోకి వచ్చాం. “తెలంగాణ ప్రజల హక్కుల సాధన చట్టపరంగానే జరగాలని భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సదుపాయాలు, సాయుధ పోరాటంలోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. గణపతిని సైతం ప్రజా జీవితంలోకి రావాలని కోరుతున్నాం’’ అన్నారు.
ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి అయిన నరహరి.. 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించారు.