ప్రాణాలు అడ్డుపెట్టైనా సింగరేణిని కాపాడుకుంటాం

ఐఎన్‌టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు న‌రేందర్

తెలంగాణకు కొంగుబంగారం లాంటి సింగరేణి సంస్థను ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటామ‌ని ఐఎన్‌టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు న‌రేందర్ అన్నారు. వేలాది మందికి అన్నం పెడుతున్న సింగ‌రేణి త‌ల్లిలాంటి సంస్థ‌ను త‌గ‌ల‌బెట్టాల‌ని బాల్క సుమ‌న్ లాంటి నేత‌లు మాట్లాడం స‌హించ‌రాని నేర‌మ‌న్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా రాజ్యాంగ పదవుల్లో ఉండి కూడా ఇటువంటి రెచ్చగొట్టే కుటిల ప్రయత్నాలు చేయడాన్ని ఐఎన్‌టీయూసీ తీవ్రంగా ఖండిస్తోంద‌న్నారు. మీ దొంగ రైతు ఉద్యమాలకు రైతులు రాకపోతే సింగరేణి సంస్థను తగలబెట్టాలని, రైలు పట్టాలను కోసివేయాలని రెచ్చగొట్టడం ఎంత వరకు సబబో ఒక్కసారి ఆలోచించాల‌ని న‌రేందర్ ప్ర‌శ్నించారు.

తల్లి లాంటి సింగరేణి సంస్థను తగలబెట్టాలని పిలుపునిచ్చినప్పుడు అక్కడే ఉన్న టీబీజీకేఎస్ నాయకులు అడ్డుకోకపోవడం బాధాకరమ‌న్నారు. ఇది బీఆర్ఎస్ నాయకుల ఉగ్ర ఆలోచనలకు నిదర్శనం కాదా అని తాము ప్ర‌శ్నిస్తున్నామ‌న్నారు. ఈ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నప్పుడు మంత్రుల స్థాయిలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపకపోవడం దేనికి సంకేతమో సమాధానం చెప్పాలని అన్నారు. సింగరేణి తల్లిని నాశనం చేయడం మీ తరం కాదని…. సింగరేణి తల్లిని కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగాలకైనా కార్మికలోకం సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలని న‌రేంద‌ర్ హెచ్చ‌రించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి నీచమైన కుట్రలకు పాల్పడుతూ, సంఘ విద్రోహ చర్యలకు ఉసిగొల్పుతున్న వారి ప్రయత్నాలను భగ్నం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ త‌ర‌ఫున తాము డిమాండ్ చేస్తున్నామ‌ని న‌రేంద‌ర్ తెలిపారు. ఓ వైపు త‌మ నేత‌, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండల చైర్మన్ జనక్ ప్రసాద్ ఆధ్వ‌ర్యంలో సింగ‌రేణి సంక్షేమానికి కృషి చేస్తుంటే మరోవైపు సంస్థని నాశనం చేయాలనే కుటీల ప్రయత్నాలు చేయడం తీవ్ర దిగ్భ్రాంతికరమ‌న్నారు. సింగరేణికి వెన్నదన్నుగా జనక్ ప్రసాద్ ఆధ్వ‌ర్యంలో ఐఎన్టీయూసీ ఎల్లప్పుడు కార్మికులకు అండగా ఉంటుందని న‌రేంద‌ర్ మరోమారు స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like