వరి ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు
Farmers set fire to rice paddies:అధికారులు కొనుగోళ్లలో జాప్యం చేయడం, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆగ్రహించిన రైతులు ధాన్యం దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమురం భీమ్ జిల్లా(Komuram Bheem District) దహెగాం మండలం లగ్గాంలో రైతులు వరి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా యాసంగి వరి కోతలు పూర్తయినా, అధికారులు కాంటాలు వేయడంలో తాత్సారం చేస్తున్నారు. తూకం వేసి బస్తాల్లో నింపిన ధాన్యాన్ని సైతం రైస్ మిల్లులకు తరలించడానికి లారీలు రాక కేంద్రాల్లోనే నిల్వ ఉండిపోతున్నాయి. వర్షాలు పడి ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన, అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. జిల్లా అధికారులు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, వానాకాలం సీజన్‌కు సమయం ఆసన్నమవుతుండటంతో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, క్షేత్రస్థాయిలో సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.