జిమ్మల పండుగ
Fish Festival: ఓ వైపు చికెన్, మటన్ రేట్లు పెరుగుతుండటంతో జనాలు చేపల కోసం పరుగులు పెడుతున్నారు. రెండు, మూడు వారాలుగా జాలర్లు చెరువుల్లో చేపలు పడుతుండటంతో అటు వైపుగా దృష్టి సారిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా చికెన్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎండల తీవ్రత వల్ల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వేసవి వేడికి కోళ్లు తట్టుకోలేక ‘హీట్ స్ట్రోక్’ బారిన పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటుతుండటంతో కోళ్ల మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి తోడు ఎండల కారణంగా కోళ్లు సరిగా ఆహారం తీసుకోకపోవడంతో వాటి బరువు పెరగడం లేదు.
ఈ నేపథ్యంలోనే మూడు వారాలుగా చేపలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎండాకాలంలో చెరువుల్లో నీరు తగ్గిపోవడంతో జాలర్లు పెద్ద ఎత్తున చేపలను పడుతున్నారు. జాలర్లు వలలు వేసి చేపలు పడుతుంటే.. స్థానికులు, చుట్టుపక్కల ప్రజలు తాజా చేపలను కొనుగోలు చేయడానికి భారీగా చెరువుల వద్దకే చేరుకుంటున్నారు. దీంతో జాలర్లు అక్కడే ప్రజలకు అమ్మేస్తున్నారు. తాజా చేపలు దొరకడంతో ప్రజలు భారీగా వచ్చి కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో చెరువుల్లో చేపలు పడుతున్నారు. బెల్లంపల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా తాండూరు మండలంలో పలు చోట్ల మూడు వారాలుగా చేపల పండుగా సాగుతోంది. బోయపల్లి, కాసిపేట, నగరం చెరువుల్లో చేపలు పడుతుంటడంతో జనం నేరుగా చెరువుల వద్దకు వెళ్తున్నారు. ఫోన్లలో ఎక్కడ చేపలు పడుతున్నారో తెలుసుకుని మరీ పెద్ద ఎత్తున చెరువు గట్టు వరకు వెళ్లి చేపలు కొనుక్కుండటం గమనార్హం. కిలో రూ. 120 నుంచి కిలో రూ. 150 వరకు దొరుకుతుండటం కూడా చేపలకు భారీగా డిమాండ్ పెరిగింది.