కేంద్రంపై యుద్ధమే
- ధాన్యం కొనుగోళ్లు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం పట్టించుకోవడం లేదు
- పంజాబ్, హర్యానాకు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదు
- కేంద్రం ధాన్యం కొనకపోతే ఉద్యమం తప్పదు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినా స్పందన లేదు
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రైతుల తరఫున దూతగా వ్యవహరించాలి
- బాధ్యత తీసుకోకపోతే తెలంగాణలో తిరగడం కష్టమవుతుంది
- కొమురంభీమ్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ధాన్యం కొనుగోళ్లతో పాటు ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్, హర్యానాకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలంగాణకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. జూన్ 15 లోపు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటిలోగా కేంద్రం ధాన్యం కొనకపోతే జూన్ 15 తర్వాత కేంద్రంపై యుద్ధం తప్పదని హెచ్చరించారు.
మహా సీఎం పట్టించుకోవడం లేదు…
కాళేశ్వరం కాస్తా కూలేశ్వరం అయిందని, ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క ఎకరా నీళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాను.. కానీ ఆయన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనై కదులుతుందని, రైతులు ఉప్పెనై కదిలితే మహారాష్ట్రకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మా బాధను, అవసరాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరారు. తుమ్మిడిహెట్టి పూర్తయితే గ్రావిటీతో లక్షలాది ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు.
కిషన్ రెడ్డిపై గురుతర బాధ్యత..
తెలంగాణకు ఇబ్బందులు తీర్చే విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(G. Kishan Reddy)పై గురుతర బాధ్యత ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. లక్షలాది మంది రైతుల పక్షాన కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించాలన్నారు. నాకు ఎలాంటి భేషజాలు లేవు… అవసరమైతే మీ ఇంటికి రావడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి సహకరించాలని కిషన్‌రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. కిషన్ రెడ్డి గారు అసలు మీ ఆలోచనేంటో ముందు బయటపెట్టండి అంటూ ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనాలంటే కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని… అలా బాధ్యత తీసుకోకుంటే కిషన్ రెడ్డికి తెలంగాణలో తిరగడం కష్టమవుతుందని హెచ్చరించారు.