సభల విజయం వెనక.. అందె వేసిన ‘చేయి’
-ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సభల విజయవంతం
-ఇంద్రవెల్లి దండోరా సభ, భట్టి పాదయాత్ర సక్సెస్‌లో కీలక పాత్ర
-తాజాగా సీఎం సభ సైతం విజయవంతం
-ఫిదా అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
-ప్రేంసాగర్ రావు పనితీరుపై నేతలు, కార్యకర్తల్లో ఆనందం
ఆరోగ్యం బాగున్నా లేకున్నా… ఆయన అనుకుంటే ఏదైనా సాధించగలరు.. అప్పగించిన పనిని ఇట్టే చేసి పెడతారు. అదేదో సాదా సీదాగా కాదు. అనుకున్న దానికంటే రెట్టింపే. అప్పగించిన పనిని అడ్డంకులు ఎన్ని వచ్చినా విజయవంతం చేయడంలో ఆయన దిట్ట… నిర్బంధాల సమయమైనా… అధికారం తమదే అయినా.. ఎంత కష్టకాలమైనా సభలను విజయంతం చేయడంలో ఆ నేత దిట్ట… నాటి పీసీసీ అధ్యక్షుడు… నేటి సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయని తత్వం, పార్టీలో మరో మారు జోస్ నింపింది… ఇంతకీ ఎవరా నేత..? ఏంటా సభల సక్సెస్ మంత్ర… ”నాంది న్యూస్” ప్రత్యేకం..
అధికారంలో బీఆర్ఎస్ పార్టీ…. ప్రతిపక్ష నేతలు మాట్లాడాలన్నా, బయటకు రావాలన్నా భయం.. చాలా మంది భయానికో, భక్తికో అధికార పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో పట్టుమని పది మంది నేతలు కూడా లేని పరిస్థితి. ఆ కాలంలో పార్టీ కోసం పనిచేయడమే కాదు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను గట్టెకించింది ఎవరంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రేమ్ సాగర్ రావ్ పేరే వినిపిస్తుంది. కాంగ్రెస్‌లో ఏమి లేదని చాలా మంది బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిపోయారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నది ఆయనే. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లి దండోరా. ఆ సభకు ఎన్నో అడ్డంకులు కల్పించారు… అయినా, పీఎస్ఆర్ వాటన్నింటిని తట్టుకుని ఆ సభను కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేశారు.
పాదయాత్రతో మరింత పటిష్టం…
ఇక ఆ తర్వాత పిప్పిరి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 రోజుల పాటు సుదీర్షకాలం సాగిన ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి యాత్ర విజయవంతం చేశారు. అది కూడా సక్సెస్ చేసి రాష్ట్రం కాంగ్రెస్ బతికే ఉందనే సంకేతాలను మిగతా పార్టీలకు పంపించగలిగారు. ఇదంతా ఒక్కెత్తు కాగా, భట్టి పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో నిర్వహించిన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేను తీసుకొచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేయగలిగారు. మంచిర్యాల సభ పాదయాత్ర, రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి దండోరాతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని పేరు తెచ్చుకున్నది పీఎస్ఆర్.
ఇప్పుడు కూడా అదే కార్యదీక్షతో..
వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత కఠిన పరీక్ష ఎదుర్కుందో.. ఇప్పుడు కూడా ఆ పార్టీకి కఠిన పరీక్షలు సాగుతున్నాయి. రైతుల కష్టాలు, యూరియా సక్రమంగా సరఫరా కాకపోవడం, వడ్ల కొనుగోళ్లు ఇలా చాలా రకాలుగా ప్రభుత్వం ఒక రకంగా వైఫల్యం చెందింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి సభ విజయవంతం అంటే కత్తి మీద సామే. కానీ, కొమురం భీమ్ జిల్లాలో సోమవారం నిర్వహించిన సభ అనుకున్న దానికంటే విజయవంతం అయ్యింది. ఆ సభకు కన్వీనర్‌గా ప్రేంసాగర్ పూర్తి స్థాయిలో సక్సెస్ చేయగలిగారు. దీంతో సభలను విజయంతం చేయడంలో ఆయన దిట్ట అనే పేరును మరోమారు నిలుపుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫిదా…
కొమురం భీమ్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది.ఇక, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఫిదా అయ్యారు. ఆయన సభలోకి వస్తూనే అందరితో చేతులు కలుపుతూ ముందుకు వెళ్లారు. సభ అయిన అనంతరం కూడా రేవంత్ రెడ్డి వెంటనే వెళ్లిపోకుండా తిరిగి ప్రజల మధ్యకు వచ్చారు. తన ప్రసంగంలో సైతం సభ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో సభ విజయవంతానికి కృషి చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు పేరు గుర్తు చేశారు. పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నా, సమయం ఎంత క్లిష్టమైనా సభలను విజయవంతం చేయడంలో ప్రేమ్‌సాగర్‌రావు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో “సభల విజయం వెనక అందె వేసిన చేయి”గా ఆయన పేరు మరోసారి చర్చకు వచ్చింది.