ఉన్నా… లేనట్టే…
-డీసీసీల పనితీరుపై కాంగ్రెస్ క్యాడర్ గరం
-సొంత ప్రాంతాలకే పరిమితమైన జిల్లా అధ్యక్షులు
-ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు బలహీనంగా మారిన కాంగ్రెస్ అధ్యక్షులు
-పార్టీని నడిపించాల్సిన నేతలే పక్కదారి పడుతున్నారంటూ ఆగ్రహం
-డీసీసీల తీరుతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి
-జిల్లా అధ్యక్షులపై ఫిర్యాదుల పర్వం
-డీసీసీల వైఫల్యంతో క్యాడర్‌లో నైరాశ్యం
డీసీసీ అధ్యక్షుల పనితీరు పార్టీని దెబ్బ తీసేలా ఉందా..? అధిష్టానం అనుకునేది ఒకటైతే.. క్షేత్రస్థాయిలో జరిగేది మరోటా..? పార్టీని గాడిన పెట్టాల్సిన నేతలే గాడి తప్పుతున్నారా..? జిల్లాకు సారథి కావాల్సిన వారు.. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అయ్యారా..? ఎమ్మెల్యేలు ఉన్న చోట వారి పప్పులు ఉడకటం లేదా..? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నా లేనట్టుగానే మారిన డీసీసీ అధ్యక్షులు ఎవరు..? అధిష్టానానికి వారిపై అందిన ఫిర్యాదులు ఏంటి..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవులు చేతికి ఆరో వేలులా మారిపోయారు. ముందుండి పార్టీని నడిపించాల్సిన వారు… ఆ విషయాన్నే మరిచిపోయారు. క్యాడర్కు అందుబాటులో ఉండకుండా, సొంత ప్రాంతాలకు పరిమితం అవుతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్, మంచిర్యాలలో పిన్నింటి రఘునాథ్ రెడ్డి, నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, ఆసిఫాబాద్ జిల్లాలో ఆత్రం సుగుణ పార్టీ బాధ్యతలు చేపట్టారు. వీరిలో ఒక్కరు మినహా మిగతా ముగ్గురి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరు పేరుకే జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతుండగా, పార్టీ పటిష్టత గాలిలో దీపంలా మారింది.
“కేసీసీ అధ్యక్షుడు”గా మారిన రఘునాథ్ రెడ్డి..
మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డిని ముద్దుగా కేసీసీ అధ్యక్షుడిగా పిలుచుకుంటారు. అంటే క్యాతన్పల్లి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అన్నమాట. ఆయన కేవలం క్యాతన్పల్లికి మాత్రమే పరిమితం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అప్పుడప్పుడు అది కూడా కేవలం చెన్నూరు నియోజకవర్గంలో మాత్రమే పర్యటిస్తుంటారు. తన నియోజకవర్గంలో వేలు పెట్టొద్దని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు హెచ్చరించడంతో అటు వైపు వెళ్లడు. బెల్లంపల్లిలో సైతం ఆయన పర్యటించడం లేదు. వారం రోజుల కిందట బెల్లంపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో నామినేటెడ్ పదవుల విషయంలో డీసీసీ అధ్యక్షుడిపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో గ్రూపులకు కొదవే లేదు. వీటన్నింటిని ఒక్కతాటిపైకి తేవాల్సిన అందులో విఫలమయ్యారు. ఇక ప్రభుత్వ పథకాల ప్రచారం గురించి అయితే, ఎంత చెబితే అంత తక్కువ.
నరేష్ జాదవ్ హైదరాబాద్‌కే పరిమితమా..?
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ క్యాడర్ కు అందుబాటులో ఉండరు… హైదరాబాద్ కే పరిమితం అవుతానే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పార్టీ పదవుల విషయంలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నియోజకవర్గ ఇన్చార్జీ ఇచ్చిన పేర్లు కాకుండా నచ్చిన వారికి పదవులు ఇప్పించారని అపవాదు మూటగట్టుకున్నారు. ఆయన వ్యవహార శైలిపై బోథ్ నియోజకవర్గ ఇన్చార్జీ ఆడె గజేందర్ వర్గం జిల్లా ఇన్చార్జీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. తన వర్గం వారికి కాకుండా వేరే వారికి ఇప్పించారని ఆ పదవులు రద్దు చేయాలంటూ బోథ్ నుంచి ఆడె గజేందర్ వర్గం హైదరాబాద్ కు వెళ్లి మరీ ఫిర్యాదు చేయడం గమనార్హం. దీనికి తోడు మార్కెట్ కమిటీ చైర్మన్ల ఎంపికలో సైతం అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.
విభేదాలకు కేరాఫ్‌గా ఆసిఫాబాద్ కాంగ్రెస్..
ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణ విబేధాలకు కేరాఫ్ అడ్రస్ మారారు. అసలు ఆమెకు అధ్యక్ష పదవి రావడమే గొడవలకు దారి తీసింది. మాజీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, ప్రస్తుత అధ్యక్షురాలు సుగుణ మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. వీళ్ల గొడవలతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బలం ఉన్నా.. చేతికి వచ్చిన చైర్మన్ పదవి చేజారింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటి చేసిన కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్పడటం వీరి పనితీరుకు నిదర్శనంగా మారింది. జిల్లాలో ఎప్పుడు ఏ సమావేశం జరిగినా చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడం, గాల్లోకి కుర్చీలు లేవడం ఇక్కడ సర్వసాధారణమని చెప్పుకుంటారు. ఆత్రం సుగుణ కేవలం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వెడ్మబొజ్జు ఒక్క అడుగు ముందే..
నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వెడ్మబొజ్జు పనితీరుపై ఒక వర్గం నిరాశతో ఉన్నా, మెజారిటీ క్యాడర్ మాత్రం నమ్మకంతో ఉన్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరు ఉన్నా అన్నింటిని అధిగమిస్తూ పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లడంలో మిగతా వాళ్లతో పోల్చితే ఒక అడుగు ముందే ఉంటాడనే పేరుంది. ఖానాపూర్ మున్సిపాలిటీ చేజారిపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఇక, బైంసా మున్సిపాలిటీలో ఆశించిన ఫలితం రాకపోవడంతో క్యాడర్ నిరుత్సాహంగా ఉన్నారు. ఆయన రాకముందు ఎవరి పెత్తనం వారిదే కొనసాగినా తను పదవి చేపట్టినప్పటి నుంచి గొడవలు, విబేధాలు, అసంతృప్తులకు సంబంధించిన వ్యవహారం ఎక్కడా బయటకు రాలేదు.
అధిష్టానం దృష్టి సారిస్తుందా..?
డీసీసీ అధ్యక్షులు క్యాడర్ ను గాడిలో పెట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలపై ఎదురుదాడి చేయడం, పార్టీ ఆదేశాలు పాటిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. దీనికి తోడు క్షేత్రస్థాయి క్యాడర్ వరకు పార్టీ నిర్ణయాలు తీసుకువెళ్లి కొత్త కార్యకర్తలను తయారు చేయడం, ప్రజలను పార్టీ వైపు ఆకర్షించేలా చేరికలను ప్రోత్సహించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షులు అసలు విషయాలను గాలికి వదిలేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. చేతికి ఆరో వేలులా మారని అధ్యక్షులపై అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి…