నేత‌ల బాయిబాట

-సింగ‌రేణి బాట ప‌డుతున్న నాయ‌కులు
-ఈ నెల 7న బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు
-15 నుంచి కోల్ బెల్ట్ ప్రాంతంలో క‌విత‌క్క ప‌ర్య‌ట‌న‌
-బొగ్గు గనుల వద్ద కార్మికులతో ప్రత్యేక సమావేశాలు
-ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించ‌నున్న క‌విత

Singareni:సింగ‌రేణిలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా, మెడిక‌ల్ త‌క్ష‌ణ‌మే నిర్వ‌హించాల‌నే డిమాండ్‌తో ప‌లువురు నాయ‌కులు సింగ‌రేణి ప్రాంతంలో ప‌ర్య‌టించ‌నున్నారు. సింగ‌రేణిపై కాంగ్రెస్ పార్టీ కుట్ర‌లు చేస్తోంద‌ని, కార్మికుల‌కు తీర‌ని అన్యాయం చేస్తోంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కారుణ్య నియామ‌కాలు లేక‌, మెడిక‌ల్ బోర్డు నిర్వ‌హించ‌క‌పోవ‌డంతో కార్మికుల బ‌తుల‌కు ఆగం అవుతున్నాయ‌ని దుయ్య‌బ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు నేత‌లు బాయిబాట పేరుతో కోల్‌బెల్ట్‌కు వ‌స్తుండ‌టంతో సింగ‌రేణిలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్క‌నుంది.

సింగ‌రేణిలో చాలా స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా కారుణ్య నియామాకాలు చేప‌ట్ట‌క‌పోవ‌డం, మెడిక‌ల్ బోర్డు నిర్వ‌హించ‌క‌పోవ‌డంతో కార్మికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ సింగరేణిలో ప్రతి నెల రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి, అధిక సంఖ్యలో కారుణ్య ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. అయితే, 15 నెలలుగా ఒక్క మెడికల్ బోర్డు నిర్వహించలేదు వేలాది మంది కార్మికులు వారసుల ఉద్యోగాల కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇక‌, తెలంగాణ ప్రభుత్వం రూ. 54 వేల కోట్లు సింగ‌రేణికి బకాయి ప‌డింది. అవి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో సింగరేణికి గుదిబండ‌గా మారింది. గ‌నులు మూత ప‌డుతున్నాయి, కొత్త‌వి రావ‌డం లేదు. దీంతో సింగ‌రేణి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఈ స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూపేందుకే నేత‌లు బాయిబాట ప‌ట్టారు.

ఈ నెల 7న హ‌రీష్‌రావు రాక‌..
సింగ‌రేణి ప్రాంతంలో నెల‌కొన్న అవినీతి అక్ర‌మాల‌పై బీఆర్ఎస్ స‌ద‌స్సు నిర్వ‌హించ‌నుంది. అందులో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు రానున్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌నిలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్‌లో నిర్వ‌హించే ఈ స‌ద‌స్సు విజ‌య‌వంతం చేయాల‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌, టీబీజీకేఎస్ అధ్య‌క్షుడు మిర్యాల రాజి రెడ్డి కోరారు. సింగరేణిలో మెడికల్ బోర్డు రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంద‌ని, ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 54 వేల కోట్ల బకాయిలు త‌దిత‌ర అంశాల‌పై హ‌రీష్‌రావు గ‌ళ‌మెత్త‌నున్నారు. ఆయ‌న రాక‌తో త‌మ యూనియ‌న్ సింగ‌రేణిలో బ‌లోపేతం అవుతుంద‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం భావిస్తోంది. ఇప్ప‌టికే ఆ యూనియ‌న్ న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు సైతం చేప‌ట్టింది.

15 నుంచి క‌విత ప‌ర్య‌ట‌న‌లు..
టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సైతం ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. బాయిబాట మొదటి విడత కార్యక్రమంలో భాగంగా 6 రోజుల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటిస్తారు. ఈ నెల 15న మందమర్రి ఏరియాలో, 16న శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటన సాగుతుంది. ఇక‌, 17న ఆర్ జీ 1 ఏరియా, 18న ఆర్ జీ 2 ఏరియా బొగ్గు గనులను సందర్శిస్తారు. 19న మంథని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్ జీ 3 ఏరియాలో పర్యటించి కార్మికుల సమస్యలను తెలుసుకుంటారు. 20న భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద పర్యటించి సింగరేణి కార్మికులతో సమావేశమవుతారు. కార్మిక క్షేత్రంలో ఎదురవుతున్న సమస్యలపై ఈ పర్యటనలో చర్చించనున్నారు.

ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంతో…
ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్న వాదనను బలంగా వినిపించడం ద్వారా కార్మికులను తమవైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) ఆధ్వర్యంలో కార్మికులను సమీకరించి, క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నారు. సింగరేణి సమస్యలు కేవలం ఆర్థిక పరమైనవే కావు, అవి వేలాది కుటుంబాల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నాయని, అందుకే ‘బాయిబాట’ కార్యక్రమం సింగరేణి ప్రాంతంలో మరింత రాజకీయ వేడిని పెంచడం ఖాయమ‌ని చెబుతున్నారు.  హ‌రీష్‌రావు సింగ‌రేణి ప‌ర్య‌ట‌న‌తో త‌మ యూనియ‌న్ బ‌లోపేతం అవుతుంద‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న స‌భ విజ‌య‌వంతానికి ఆ యూనియ‌న్ నేత‌లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక‌, క‌విత సింగ‌రేణిలో హెచ్ఎంఎస్‌కు మ‌ద్ద‌తు చెబుతున్నారు. అటు కార్మికుల స‌మ‌స్య‌ల‌పై గ‌ళం ఎత్త‌డంతో పాటు ఆ యూనియ‌న్ బ‌లోపేతం చేసేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like