క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో ముసలం… కొత్త మంత్రి రాజీనామా

Minister Ramalinga Reddy Resign from Cabinet: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ షాక్ తగిలింది. సీఎం డీకే శివకుమార్ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 48 గంటల్లోనే సీనియర్ నేత ఆర్‌. రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను అనుకున్న శాఖను, కేటాయిస్తానని చెప్పిన హామీ మరిచిపోయి మరో శాఖ కేటాయించడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే తాను రాజీనామా చేసింది కేవలం మంత్రి పదవికేనని.. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు.

బెంగళూరు అభివృద్ధి శాఖ త‌న‌కు కేటాయిస్తాన‌ని ముఖ్యమంత్రి శివకుమార్ మాట తప్పారని ఆరోపించారు. 2023లోనే ఈ శాఖకు సంబంధించి తనకు ఒక స్పష్టమైన హామీ లభించిందని.. రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక.. ఆ శాఖను పూర్తిగా తనకు అప్పగిస్తారనే ముందస్తు అవగాహన తమ మధ్య కుదిరిందని.. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయని రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఈ శాఖను కృష్ణ బైరేగౌడకు కేటాయించారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో డీకే శివ‌కుమార్‌ స్వయంగా ఈ శాఖను పర్యవేక్షించారు. దీన్ని బైరేగౌడకు కేటాయించి, రామలింగా రెడ్డికి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను అప్పగించారు. ఇది ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో మంత్రివర్గం నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

తన రాజీనామా పత్రాన్ని డీకే శివకుమార్ కు పంపించారు. అందులో అన్ని విషయాలనూ పొందుపర్చానని చెప్పారు. రాజీనామా లేఖలో.. “నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి, మీకు కృతజ్ఞతలు. నేను నా ఆత్మసాక్షికి వ్యతి రేకంగా వ్యవహరించలేను. నా ఆత్మసాక్షికి అనుగుణంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లేవు. నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. ఇకపై నేను కేవలం ఎమ్మెల్యేగా, పార్టీ కార్యకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తాను” అని స్పష్టం చేశారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like