అర్ధరాత్రి లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు

లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాకాబందీ చేసి వాహనాల తనిఖీలు చేయడమే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు సైతం చేశారు. శనివారం అర్ధరాత్రి మంచిర్యాల డీసీపీ భాస్కర్ స్వయంగా పాల్గొని క్షేత్రస్థాయిలో తనిఖీలను పర్యవేక్షించారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా,లక్ష్మీ థియేటర్ ప్రాంతాల్లో పోలీసు సిబ్బందితో కలిసి నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డీసీపీ భాస్కర్, లాడ్జీల రికార్డులను పరిశీలించారు. గదుల్లో బస చేస్తున్న వారి వివరాలను సేకరించారు.

ఈ సందర్భంగా లాడ్జీల యాజమాన్యాలు, నిర్వాహకులకు పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు. లాడ్జీలకు వచ్చే ప్రతి వ్యక్తి ఆధార్, ఫోన్ నంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, వారి గుర్తింపు పత్రాలను ధృవీకరించాలని సూచించారు. అలాగే లాడ్జీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు,జిల్లాలు లేదా ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని, వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపే లక్ష్యంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని డీసీపీ తెలిపారు. డీసీపీ వెంట మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు, ఎస్‌ఐ మధుసూదన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like