లేనిది ఉన్న‌ట్టు… అంతా క‌నిక‌ట్టు…

-సింగరేణిలో వందల కోట్ల కుంభకోణాలు
-కాగితాల్లోనే బొగ్గు నిల్వలు
-కార్మికుల జీతాలకూ అప్పులే:
-కమిషన్ల కోసమే సోలార్ ప్లాంట్లు
-సీఎం బావమరిదికి టెండర్లు ఎలా ఇస్తారు

Singareni:సింగ‌రేణిలో లేనిది ఉన్న‌ట్లు, ఉన్న‌ది లేనట్లు చూపుతున్నార‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు(Former Minister Harish Rao) స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి ప‌రిస్థితిపై ఆదివారం ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్య‌క్తం చేశారు. సింగరేణిలో ఓబీ గనులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, జిల్టెన్ స్టిక్స్, కోల్ స్టోజ్ ఇలా అన్నిట్లో కుంభకోణాలు జరిగాయన్నారు. సింగరేణికి ఆర్థికంగా ఎంతో నష్టం జరుగుతోందన్నారు. ఫీల్డ్ విజిట్ సరికాదంటూ తెలంగాణ ప్ర‌భుత్వం నైని బొగ్గు గనుల టెండర్లు రద్దు చేసిందని అన్నారు. అయితే, అదే విధానంతో సీఎం బావమరిదికి ఇదే సింగరేణి లో టెండర్ లు ఎలా ఇచ్చారని హ‌రీష్‌రావు ప్ర‌శ్నించారు.

సింగరేణి లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు విషయంలోనూ కమీషన్ల కోసం అవకతవకలకు పాల్ప‌డ్డార‌ని దుయ్య‌బ‌ట్టారు. వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ లు వృథాగా ఉన్నాయని హ‌రీష్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ఆ విద్యుత్ కొనడం లేదు.. పీపీఏ లేదు.. ఇలా సింక్ర‌నైజేష‌న్ లేక సోలార్ ప్లాంట్లు వృథాగా పోతున్నాయని హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం కేవ‌లం కమీషన్ల కోసమే అవసరం లేనన్ని సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టింద‌న్నారు. రెండున్నర రూపాయలకి NTPC సోలార్ విద్యుత్ ఇస్తుంటే.. సింగరేణి ధర మాత్రం 5 రూపాయలు పెట్టారని స్ప‌ష్టం చేశారాయ‌న‌.

సింగరేణి కార్మికుల జీతాల కోసం బ్యాంకు నుండి ఓడి లు తెచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేద‌న వ్యక్తం చేశారు. జిలిటెన్ స్టిక్స్ కొనుగోళ్లలోనూ కుట్రలు చేసి కమిషన్ లకి కక్కుర్తి పడ్డారని హ‌రీష్ రావు దుయ్య‌బ‌ట్టారు. సింగరేణి బొగ్గు నిల్వలు కాగితాల లెక్కలు వేరే ఉన్నాయని… కానీ, గనుల్లో బొగ్గు నిల్వలు చూస్తే అంత కనిపించలేద‌ని స్ప‌ష్టం చేశారు. లేని బొగ్గు ఉన్నట్టు చూపించి టాక్స్ కట్టారని అన్నారు. నిజంగా అంత బొగ్గు ఉంటే … వాటి నిల్వ ఎక్కడుందో చూపించాలని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like