జూనియర్ ఎన్టీఆర్‌కు భుజానికి గాయం
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఓ షూటింగ్ జరుగుతుండగా సాయంత్రం దురదృష్టవశాత్తూ ఆయన భుజానికి గాయమైనట్టు ఆయన కార్యాలయం తాజాగా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ చికిత్స జరుగుతున్నట్టు తెలిపింది.
ఎన్టీఆర్ టీమ్ రిలీజ్ చేసిన ప్రకటనలో.. ఈ రోజు సాయంత్రం ఎన్టీఆర్ గారి భుజానికి దురదృష్టవశాత్తు గాయమైందని తెలియజేయడానికి చింతిస్తున్నాము. డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ.పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం చేసిన సమగ్ర వైద్య పరీక్షల అనంతరం ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుండి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని అందరికీ హామీ ఇస్తున్నాము. ఆయన ఆరోగ్యం, కోలుకోవడం గురించి అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాము అని తెలిపారు.
అయితే ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలను టీమ్ వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు తారక్. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. బహుశా ఈ మూవీ చిత్రీకరణలోనే ఆయన భుజానికి గాయమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.