సై అంటే సై..

-సింగ‌రేణిలో అవినీతిపై స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు
-అక్ర‌మాల‌పై గ‌ళ‌మెత్తుతున్న హ‌రీష్‌రావు, కేటీఆర్‌
-కోల్‌బెల్ట్ కేంద్రంగా హ‌రీష్‌రావు స‌మావేశం
-కేంద్ర‌మంత్రికి లేఖ రాసిన కేటీఆర్‌
-ఏ చ‌ర్చ‌కైనా సిద్ధ‌మంటున్న ప్ర‌భుత్వం
-విచార‌ణ చేయిస్తామంటున్న మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు
-సింగ‌రేణిలో ర‌గులుకున్న రాజ‌కీయ వేడి

Singareni:సింగ‌రేణిలో అగ్గి ర‌గులుకుంది… ఇప్పుడు ఎన్నిక‌లేం లేవు… కానీ, రాజకీయ వేడి సాగుతోంది. ఒకరు ప్ర‌భుత్వ అవినీతిపై దుమ్మెత్తి పోస్తుంటే…. ఇంకొక‌రు కేంద్రానికి లేఖ రాస్తున్నారు.. కార్మికుల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ళ‌మెత్తుతున్నారు. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌తి స‌వాల్ విసురుతోంది. దీంతో సింగ‌రేణి ప్రాంతంలో నాయ‌కుల స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు కొనసాగుతున్నాయి…

నిన్నా మొన్న‌టి వ‌ర‌కు రైతుల క‌ష్టాలు, యూరియా నిల్వ‌లు, రైతు భ‌రోసా ఇలా రైతు కేంద్రంగా సాగిన అధికార, ప్ర‌తిప‌క్ష మాట‌ల యుద్ధం ఇప్పుడు సింగ‌రేణి వైపు మ‌ళ్లింది. సింగ‌రేణి కేంద్రంగా రాజ‌కీయ వేడి ర‌గులుకుంది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేటీఆర్, హ‌రీష్‌రావు సింగ‌రేణిలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై గ‌ళ‌మెత్తుతున్నారు. హ‌రీష్‌రావు అనారోగ్యంతో ఉన్నా… అన్‌ఫిట్ చేయ‌ని కార్మికుల‌ను తీసుకుని ఏకంగా హైద‌రాబాద్ సింగ‌రేణి కార్యాల‌యంలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రెండు రోజుల కింద‌ట టీబీజీకేఎస్ నేత‌ల స‌మావేశం నిర్వ‌హించి అవినీతిపై స‌వాల్ విసిరారు. ఇక కేటీఆర్ ఈ అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ చేయాలంటూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం ఏ విచార‌ణ‌కైనా సిద్ధ‌మంటూ ప్ర‌తి సవాల్ విసిరింది. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోసిన హ‌రీష్‌రావు..
రెండు రోజుల కింద‌ట మాజీ మంత్రి హ‌రీష్‌రావు(Former Minister Harish Rao) సింగ‌రేణిలో స‌ద‌స్సు నిర్వ‌హించి ప్ర‌భుత్వ ప‌నితీరు, ముఖ్య‌మంత్రి తీరుపై విమ‌ర్శ‌ల ప‌ర్వం గుప్పించారు. వేల కోట్ల అవినీతి జ‌రుగుతోందని, సింగరేణి సొమ్ము దోచుకుంటున్నారని దుయ్య‌బ‌ట్టారు. గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో కార్మికుల‌ను ఇంటికి పంపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మెడికల్ బోర్డు పెట్టకుండా కార్మిక కుటుంబాలను గోస పెడుతున్నారని, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళను కూడా ఫిట్ అంటూ ఉద్యోగం చేయాలని వేధిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. సైట్ విజిటింగ్ స్కాం, సోలార్ పవర్ స్కాంతో పాటు అనేక స్కాంలకు కాంగ్రెస్ పాల్పడిందని స్ప‌ష్టం చేశారు. సింగరేణి చరిత్రలో ఎన్నడు లేని సైట్ విజిటింగ్ రూల్ పెట్టార‌ని, రేవంత్ బావమర్ది కోసమే ఈ నిబంధ‌న తెచ్చారంటూ దుయ్య‌బ‌ట్టారు. ఓబీ టెండర్లలో మైనస్ కోట్ చేసే వార‌ని, కానీ ఇప్పుడు సైట్ విజిటింగ్ తో ప్లస్ టెండర్ కోట్ చేస్తున్నారని వెల్ల‌డించారు.

కిష‌న్ రెడ్డికి కేటీఆర్ లేఖ‌..
సింగరేణిలో జ‌రుగుతున్న అవినీతిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister for Coal Mines Kishan Reddy)కి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(BRS Working President KTR) బహిరంగ లేఖ రాశారు. సంస్థ ప్రకటించిన నిల్వల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైందని ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి అప్పనంగా అమ్ముకున్నారా? రూ.1,600 కోట్ల విలువైన స్కామ్‌పై బీఆర్‌ఎస్‌ ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడంలేదు?’ అంటూ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలనలో సింగరేణి స్కామ్‌లకు కేరాఫ్‌గా మారిందని మండిపడ్డారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిలో బట్టబయలైన రూ. 1,600 కోట్ల భారీ కుంభకోణం కార్మికలోకాన్ని తీవ్రంగా కలవరపరుస్తున్నదని వాపోయారు. కాంగ్రెస్‌ గద్దెనెక్కిన తర్వాత వరుస స్కామ్‌లతో సింగరేణి వణికిపోతున్నదన్నారు. ఈ స్కామ్ దాచిపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని గనుల వద్దకు పంపాలని డిమాండ్‌ చేశారు.

ఎలాంటి విచార‌ణ‌, చ‌ర్చ‌కైనా సిద్ధ‌మ‌న్న దుద్దిళ్ల‌..
సింగరేణిలో బొగ్గు నిల్వలు, ఇతర వ్యవహారాలపై ఎలాంటి విచారణ, చర్చకైనా సిద్ధమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(State Industries Minister Duddilla Sridhar Babu) స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నామన్నారు. సింగరేణి బొగ్గు నిల్వలు, నిల్వల మాయం ఆరోపణలపై పూర్తి స్థాయి విచార‌ణ‌ చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థను మరింత విస్తరించి, కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ (BRS) నేతలు హరీష్ రావు, కేటీఆర్ లేవనెత్తిన ఆరోపణలను ఖండించారు. ఓటమి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సింగరేణి సంస్థను, కార్మికుల ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, ఇప్పటికే వేలాది ఉద్యోగాల నియామకాలు, భారీగా బోనస్ అందించినట్లు గుర్తుచేశారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like