గోదావరిలో ముగ్గురు గల్లంతు
గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నీట మునిగారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు.
ప్రమాదం జరిగిందిలా..
హైదరాబాద్ కాచిగూడలోని చెప్పల్ బజార్‌కు చెందిన చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేష్‌కుమార్ (31) ముగ్గురు అన్నదమ్ములు ఈ రోజు ఉదయం కాచిగూడ నుంచి రైలులో బాసరకు చేరుకున్నారు. అనంతరం బాసరలోని గోదావరి నదికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా, నీటి ప్రవాహ తీవ్రతకు ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో ముగ్గురూ నదిలో మునిగిపోయారు.
ముమ్మరంగా గాలింపు చర్యలు:
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన ముగ్గురు అన్నదమ్ముల ఆచూకీ కనుగొనడం కోసం ఎస్డీఆర్ఎఫ్ (SDRF) ప్రత్యేక బృందాలు, స్థానిక మత్స్యకారులతో కలిసి నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు కళ్లముందే నదిలో కలిసిపోవడంతో బాసర ఘాట్ వద్దకు వచ్చిన భక్తులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.