దశాబ్దాల నిర్లక్ష్యానికి తెర…
-తెలంగాణ అన్నవరానికి మహర్దశ
-గూడెం గుడి అభివృద్ధికి సర్కారు గ్రీన్ సిగ్నల్!
-రూ. 58 కోట్లతో భక్తులకు సౌకర్యాల కల్పన
-రేపు పనులకు శంకుస్థాపన చేయనున్న డీప్యూటీ సీఎం
-హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు..
Gudem Satyanarayana Swamy Temple:భారతదేశంలోనే అత్యంత పురాతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం… ఆంధ్రా పాలకుల వివక్షకు గురైంది… పాలకులు ఎవరూ పట్టించుకోలేదు.. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు.. కనీసం నిద్ర చేద్దామంటే వసతులు లేవు.. దీంతో ఇబ్బందుల్లోనే స్వామి దర్శనం చేసుకుని వెళ్లేవారు… కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గుడికి నిధులు కేటాయించింది… రూ. 58 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించనుంది… రేపు డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), పలువురు మంత్రులు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
365 రోజులు సత్యనారాయణ స్వామి వ్రతాలు… బ్రహ్మోత్సవ శోభ.. స్వామి వారి కళ్యాణం… ఇలా నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది… దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం(Gudem Satyanarayana Swamy Temple). గోదావరి తీరాన, గుట్టపై వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో నిత్యం వేలల్లో స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ పవిత్రమైన రోజులలో భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. కేవలం ఈ మాసంలోనే కాకుండా, ప్రతి నెలా పౌర్ణమి, స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం కిటకిటలాడుతుంది.
భక్తులకు కనీస సౌకర్యాలు కరువు..
అయితే, గూడెం దేవాలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దంపతులు వత్రం చేసుకునే మంటపం చాలా ఇరుకుగా ఉంది.. అక్కడ సత్యనారాయణ స్వామి వత్రాలు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని విస్తరించాలని ఎన్నిమార్లు విన్నవించినా ప్రయోజనం సున్నా అయ్యింది. ఇక, తలాపునే గోదావరి ఉన్నా భక్తులకు దాహార్తి తీర్చే వ్యవస్థ కూడా లేదు. ఇక దేవుడి సన్నిధిలో నిద్ర చేద్దామంటే కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. జాతరకు కళ్యాణానికి భక్తులు భారీగా తరలివస్తారు. పైన కిక్కిరిసి ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా పేరుకే తెలంగాణ అన్నవరం కానీ, ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడకు వచ్చే భక్తులు అష్టకష్టాలు పడుతూ స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని వెళ్తున్నారు.
రూ. 58 కోట్లతో చేపట్టే పనులు ఇవే…
ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇచ్చిన హామీ మేరకు ఈ గుడికి నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు(MLA Premsagar Rao) సైతం నిధులు తర్వగా వచ్చేందుకు కృషి చేయడమే కాకుండా, దానితో గుడి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. గర్భగుడిలో మూలమూర్తులను ముట్టుకోకుండా, గుడిని వెడల్పు చేయడం, చుట్టూ నాలుగు గోపురాలు నిర్మించనున్నారు. దంపతులు వత్రం చేసుకునే మంటపం విశాలంగా మార్చడం, దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది కూర్చునేలా విస్తరించనున్నారు. అదే సమయంలో, భక్తులు నిద్రించేందుకు సైతం కాటేజీలు నిర్మించనున్నారు. ఇలా నిధులతో గుడి రూపురేఖలు మారనున్నాయి. ఈ నిధులు సరిపోకపోతే మరిన్ని నిధులు తెచ్చేందుకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు చెబుతున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు..
ఈ నెల 13న దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వస్తున్నారు. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని ఆలయానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నిధులు తీసుకు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు తర్వగా పూర్తి చేసి భక్తుల ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు.