గనులపై BMS భరోసా యాత్ర

-హామీల అమలులో ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ విఫ‌లం
-BMS పోరాటంలో క‌లిసిరావాలంటూ అప్ప‌ని పిలుపు

సింగరేణిలో BMS రాజీలేని పోరాటం చేస్తుంద‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్‌ అధ్యక్షుడు అప్పాని శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న భూపాల‌ప‌ల్లి ఏరియాలో గ‌నుల‌పై ప‌ర్య‌టించారు. ఆయ‌న కేటీకే 8 ఇంక్లైన్‌లో కార్మికుల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ సింగరేణి రక్షణ కోసం చేపడుతున్న ఉద్యమ కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి అభివృద్ధిపై గుర్తింపు ప్రాతినిథ్య‌ సంఘాలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్య‌బ‌ట్టారు. కార్మికులను క‌లిసి సింగ‌రేణి భ‌విష్య‌త్ కార్యాచరణ రూపొందిస్తామ‌న్నారు.

సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వ‌హిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు కార్మిక సమస్యలపై స్పందించకుండా, సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యాన్ని పెంచడం సంస్థ భవిష్యత్తుకు ప్రమాదకరమన్నారు. కార్మికుల మారుపేర్ల సమస్యలు, విజిలెన్స్ కేసుల పరిష్కారం, కోల్‌బెల్ట్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ఇలా కార్మికులకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేయాలని అప్ప‌ని డిమాండ్ చేశారు.

ప్రతి కార్మికుడికి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రెండు గుంటల స్థలం అందజేయాల‌ని, అన్ని కేటగిరీలకు మెరుగైన క్యాడర్ స్కీమ్ అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాల కొనసాగించాల‌ని, నూతన ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. సింగరేణిని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సంస్థ దీర్ఘకాల ప్రయోజనాల కోసం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ప‌రిచ‌య కార్య‌క్ర‌మంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ఉపాధ్య‌క్షుడు వెలబోయిన సుజేందర్, బ్రాంచి కార్యదర్శి రేణికుంట్ల కాడారి శంకర్, పిట్ క‌మిటీ అడప రాజు, D నారాయణ శీలం రాజు మల్లేష్, శ్రవణ్ , కనకయ్య, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like