యథావిధిగా సింగరేణి మెడికల్ బోర్డు

- సింగరేణి కార్మికులకు భట్టి శుభవార్త
- అర్హులకే కారుణ్య నియామకాలు
- పారదర్శకంగా మెడికల్ బోర్డు నిర్వహణ
- సంక్షేమ సింగరేణికి భట్టి భరోసా
- కార్మికుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం
- రేపు 335 మంది వారసులకు ఉద్యోగ పత్రాలు
- ఉప‌ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క మల్లు

Singareni:”నా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సింగరేణి కార్మికుల కష్టాలను కళ్లారా చూశాను. వారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. రాబోయే రోజుల్లో ఒడిశాలోని ‘నైనీ బ్లాక్’ తరహాలోనే ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణిని విస్తరించి, కొత్త బొగ్గు బ్లాకుల ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం. అయితే అంతర్జాతీయ పోటీలో సింగరేణి నిలబడాలంటే కార్మికులంతా ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు సహకరించాలి.ష‌ – ఉప‌ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క మల్లు

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(State Deputy Chief Minister Bhatti Vikramarka) శుభవార్త చెప్పారు. వివిధ కారణాలతో కొంతకాలంగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డు ప్రక్రియ అతి త్వరలో యథావిధిగా ప్రారంభించాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ బోర్డు అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు భట్టి తెలిపారు. కార్మికుల్లో నెలకొన్న ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, వారి ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

అర్హులకే ప్రయోజనం.. అక్రమాలకు తావులేదు
మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం లేదా మోసాలకు అవకాశం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సింగరేణిలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల సమస్య కూడా ప్రభుత్వ దృష్టిలో ఉందని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నామని, న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. నిబంధనల మేరకు సానుకూల నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

335 మందికి ఉద్యోగ నియామక పత్రాలు
కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు ఈ నెల 13న మంచిర్యాలలో జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో మొత్తం 2,657 పోస్టులను భర్తీ చేసినట్లు భట్టి వెల్లడించారు. వీటిలో 555 ఎక్స్‌టర్నల్ పోస్టులు కాగా, 2,102 కారుణ్య నియామకాలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యక్ష ఉద్యోగాల భర్తీని కూడా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించి వివాదాలకు తావులేకుండా అర్హులకు అవకాశాలు కల్పించినట్లు చెప్పారు.

కారుణ్య నియామకాల వయోపరిమితి పెంపు
కారుణ్య నియామకాల కోసం గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే 200 మందికి పైగా లబ్ధి చేకూరిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు భట్టి తెలిపారు. అదనంగా బ్యాంకులతో చర్చించి ఉద్యోగుల కోసం రూ.10 లక్షల ఉచిత సహజ మరణ బీమా సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా రక్షణ కల్పించినట్లు వెల్లడించారు.

రికార్డు స్థాయిలో లాభాల వాటా, బోనస్
ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా కార్మికులకు లాభాల వాటా చెల్లించినట్లు మంత్రి పేర్కొన్నారు. గత రెండేళ్లలో రూ.1,500 కోట్లను లాభాల వాటా రూపంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు కూడా తొలిసారిగా బోనస్ చెల్లిస్తున్నామని, 2023-24లో ఒక్కొక్కరికి రూ.5,000, 2024-25లో రూ.5,500 చొప్పున బోనస్ అందించినట్లు చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏరియా ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నామని భట్టి తెలిపారు. గోదావరిఖనిలో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, డిపెండెంట్ పిల్లల వైద్య సేవల కోసం ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

సింగరేణి విస్తరణకు ప్రత్యేక చొరవ
భవిష్యత్తులో సింగరేణిని మరింత విస్తరించి ఉద్యోగుల వారసులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ అనుమతులు, ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. పోటీ మార్కెట్లో సింగరేణి మరింత బలపడాలంటే ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఉద్యోగులందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like