దోపిడీదారుల‌కు సింగ‌రేణిలో స్థానం లేదు

Deputy Chief Minister Bhatti Vikramarka on Singareni:సింగరేణిలో దోపిడీదారుల‌కు స్థానం లేద‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) నిప్పులు చెరిగారు. కార్మికుల శ్రమ, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న బీఆర్ఎస్‌ నేతలపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పేందుకు ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు(MLA Premsagar Rao)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధిలో కార్మికుల చెమట, కఠోర శ్రమ దాగి ఉన్నాయన్నారు. వారి ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదన్నారు.

సింగరేణి యాజమాన్య నిబద్ధతను, సంస్థలోని పారదర్శక విధానాలపై బీఆర్ఎస్ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి మకుటాయమానమైన సింగరేణి సంస్థను అభాసుపాలు చేయాలనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఇక్కడ ఏదో తప్పు జరిగిపోతుంద‌న్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు కేంద్రానికి లేఖలు రాయడం సత్యదూరంగా ఉన్నాయని చెప్పారు. ​సొంత రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ భవిష్యత్తును, సింగరేణి సంస్థను వాడుకోవడం తగదని భట్టి విక్రమార్క హితవు పలికారు.

​ సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు. ​​సింగరేణి సంస్థపై దోపిడీదారులు, డేగలు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడేలా ప్రజా ప్రభుత్వం అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తుందని అన్నారు. రాజకీయ అవసరాల కోసం సంస్థను వాడుకోవాలని చూస్తే.. తాము ఊరుకోబోమన్నారు. భవిష్యత్తులోనూ సింగరేణి అత్యంత పారదర్శకంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ​సింగరేణిలో జరుగుతున్న ప్రతి ప్రక్రియ అత్యంత ఆధునికంగా, కంప్యూటరైజ్డ్ విధానంలో పారదర్శకంగా సాగుతోందని ఈ సందర్భంగా అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు.

కార్మికులకు అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని, ఇందులో భాగంగా అత్యంత ఆధునికమైన క్యాథ్ ల్యాబ్ (Cath Lab) వంటి వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ​సింగరేణి కార్మికుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ₹1 కోటి 25 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని గుర్తుచేశారు.

​కార్మికుల పిల్లల ఉన్నత ఆశయాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల పిల్లలు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతుంటే, వారికి ప్రిలిమ్స్, మెయిన్స్ రాయడానికి ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్ళలో మేళవించి సింగరేణిని ముందుకు తీసుకువెళతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like