సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ కుట్ర‌

-సింగరేణి బకాయిలు ₹50వేల కోట్లు వెంటనే చెల్లించాలి
-పాలసీలు చేయాల్సిన వాళ్లే వినతి పత్రాలిస్తూ మభ్యపెడుతున్నారు
-డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఉద్యమం తప్పదు
-కార్మికుల పక్షాన హెచ్ఎంఎస్‌తో కలిసి పోరాటం

TRS leader Kalvakuntla Kavitha:తెలంగాణ రక్షణ సేన (TRS) చేపట్టిన “బొగ్గుబాయి” కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత(TRS leader Kalvakuntla Kavitha) కాసిపేట మైన్-1సందర్శించి సింగరేణి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అనంతరం నిర్వహించిన గేటు మీటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సింగరేణి ప్రాంతాలకు వచ్చి వినతిపత్రాలు ఇస్తూ కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. పాలసీలు రూపొందించి అమలు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు బాధ్యతలను విస్మరించారని విమర్శించారు.

డిపెండెంట్ ఉద్యోగాలపై పోరాటం తప్పడం లేదు
సింగరేణి కార్మికులకు హక్కుగా రావాల్సిన డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కవిత అన్నారు. కొత్త బొగ్గు గనులు తీసుకొస్తే లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చని, కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అండర్‌గ్రౌండ్ మైనింగ్‌ను క్రమంగా మూసివేసి, ఓపెన్‌కాస్ట్‌లను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణిని నిజంగా కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే సంస్థకు బకాయి ఉన్న రూ.50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌, ఢిల్లీలో ఉండి సింగరేణికి కొత్త బొగ్గు బావులు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

మెడికల్ బోర్డు కోసం కూడా పోరాటమే
సింగరేణిలో నెలకు రెండుసార్లు జరగాల్సిన మెడికల్ బోర్డులను నిర్వహించేందుకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందని కవిత అన్నారు. టీఆర్ఎస్ సింగరేణి భవన్‌ను ముట్టడించిన తర్వాతే మెడికల్ బోర్డు నిర్వహించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం హెచ్ఎంఎస్‌తో కలిసి టీఆర్ఎస్ సంయుక్తంగా పోరాడుతుందని కవిత ప్రకటించారు. రానున్న ఎన్నికలు, ఉద్యమాల్లోనూ ఈ ఐక్యత కొనసాగుతుందని స్పష్టం చేశారు. హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ ఎలాంటి రాజీ లేకుండా కార్మికుల కోసం పోరాడుతున్నారని కొనియాడారు.

విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం
టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత సింగరేణిలో తన తొలి పర్యటన ఇదేనని కవిత పేర్కొన్నారు. కాసిపేట నుంచి ప్రారంభమైన “బాయి బాట” కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని, సింగరేణి 11 ఏరియాల్లో పర్యటించి కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటామని చెప్పారు. సింగరేణి కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందుబాటులో లేవని కవిత అన్నారు. కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

తెలంగాణ రక్షణ సేన “పాంచజన్యం” పేరిట ఐదు కీలక అంశాలతో ప్రజల ముందుకు వచ్చిందని వివరించారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు సింగరేణి కార్మికులతో అనుబంధం కొనసాగుతోందని, ఎక్కడ ఉన్నా వారి కోసం పోరాటం చేశానని కవిత చెప్పారు. కొత్త రాజకీయ శక్తిగా ఏర్పడిన టీఆర్ఎస్‌కు సింగరేణి కార్మికుల దీవెనలు, మద్దతు ఉండాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like