గుజ‌రాత్ కేంద్రంగా నకిలీ పత్తి విత్తన రాకెట్

-చేధించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు
-న‌లుగురి అరెస్టు, ప‌రారీలో తొమ్మిది మంది

గుజరాత్ ప్రధాన కేంద్రంగా కొన‌సాగుతున్న‌ నకిలీ పత్తి విత్తనాల రాకెట్‌ను ఆదిలాబాద్ పోలీసులు చేధించారు. గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలు హైదరాబాద్ కు అక్క‌డి నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల‌కు ఈ విత్త‌నాల‌ను చేర‌వేస్తున్నారు అక్ర‌మార్కులు… ఈ అక్రమ వ్యాపారానికి ఒడిగడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా వివరాలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. అమాయక రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని గుజరాత్ కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాలు చేరవేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల తరహాలోనే బోల్ గార్డ్ 3 పత్తి విత్తనాలు రైతులకు తక్కువ ధరకు అంటగడుతున్నారు. ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచినట్టు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ గోడౌన్ పై దాడి చేశారు. అక్క‌డ రూ. 20 ల‌క్ష‌ల విలువైన‌ 792 విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

గుజరాత్ రాకెట్ ను చేధిస్తాం..!
గుజరాత్ కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందని, త్వరలోనే అక్కడ ఫ్యాక్టరీని సీజ్ చేస్తామని ఎస్‌పీ అఖిల్ మహాజన్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంలో బ్రాండెడ్ కంపెనీల పేరుతో ప్యాకెట్లు తయారుచేసి ముఠా ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపారం సాగిస్తున్నారని తెలిపారు. ఇచ్చోడ మండలం దాబాకే లో కొంతమంది రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టారని ఎస్పీ తెలిపారు. రైతుల జీవితాలతో చెలగాటమాడే అక్రమార్కులను వదిలేది లేదన్నారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుండి కారు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, టూ టౌన్ సిఐ నాగరాజు, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like