ఒత్తిడిలో ఉన్న విద్యార్థినికి పోలీస్ సాయం
పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయం.అలాంటి సమయంలో ఎదురయ్యే చిన్న సమస్య కూడా వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రం వద్ద ఇలాంటి సంఘటన చోటుచేసుకోగా, భీమారం ఎస్సై రాజేందర్ సకాలంలో స్పందించి విద్యార్థినికి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ విద్యార్థిని పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకురావడం మరిచిపోయింది. పరీక్షా కేంద్రం నిబంధనల ప్రకారం ఫొటో తప్పనిసరి కావడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. పరీక్ష రాయలేనేమోనన్న భయంతో పరీక్షా కేంద్రం బయటకు వచ్చిన ఆమె పరిస్థితిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విధులు నిర్వహిస్తున్న భీమారం ఎస్సై రాజేందర్ గమనించారు. విద్యార్థిని ఆందోళనను అర్థం చేసుకున్న ఎస్సై రాజేందర్ వెంటనే స్పందించి,పోలీసు వాహనంలో సమీపంలోని ఫొటో స్టూడియోకు తీసుకెళ్లి ఫొటో తీయించి, అనంతరం ఆమెను సకాలంలో తిరిగి పరీక్షా కేంద్రానికి చేర్చారు. దీంతో విద్యార్థిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షకు హాజరైంది. విద్యార్థిని భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తక్షణమే స్పందించి సహాయం చేసిన ఎస్సై రాజేందర్‌ను పలువురు అభినందించారు.