మోదీ పెద్ద మనసు..
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న అభ్యర్థులకు ట్రాఫిక్ అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో తన కాన్వాయ్ ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకున్నారు.
ఆదివారం మధ్యాహ్నం 1.15కు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ.. మోదీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి తన నివాసానికి బయలుదేరాల్సి ఉండగా.. ఆ ప్రయాణాన్ని 45 నిమిషాల పాటు వాయిదా వేసుకున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమైన నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు హాజరుకానున్న విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు మోదీ. ఇటీవల జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రీ-ఎగ్జామ్ నిర్వహించింది. దేశంలోని వందలాది పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని కొన్ని నగరాల్లో కూడా పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థులకు అదనపు సమయం కల్పించారు.
పరీక్షా కేంద్రాల వద్ద బహుళస్థాయి భద్రత అమలు చేశారు. అభ్యర్థులను మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేయడంతో పాటు, కేంద్రాల్లో సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక జామర్లు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా గదిలో ఇన్విజిలేటర్లను నియమించి, కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. అదనంగా బయోమెట్రిక్ ధృవీకరణ, ముఖ గుర్తింపు వ్యవస్థలను ఉపయోగించి అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. పరీక్షా ప్రశ్నాపత్రాల భద్రత కోసం పోలీసులు, పారామిలిటరీ బలగాలు, పోస్టల్ శాఖతో పాటు ఇతర కేంద్ర సంస్థల సహకారం తీసుకున్నారు. రహస్య పత్రాల నిల్వ, రవాణా, పంపిణీ ప్రక్రియలను ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించారు.
ప్రధాని చర్యపై కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం మోదీ నాయకత్వ లక్షణమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం బాధ్యతాయుత పాలనకు నిదర్శనమని అన్నారు.