మాఫియాకు అడ్డొస్తే చంపేస్తారా..?
భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలని, సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొట్టి జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీటీవో వెంకన్న చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో టిప్పర్‌ని ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో టిప్పర్ నేరుగా వెంకన్నను ఢీకొట్టి, ఆయనపై నుంచి దూసుకెళ్లింది. DTO వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో వెంకన్న మృతదేహం నుజ్జు నుజ్జెంది. 15 రోజుల కిందటే ఆయన జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం ప్రమాదమా లేక తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో జరిగిన నిర్లక్ష్యమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.