సింగరేణిలో మొహర్రం.. మహా విషాద గాయం!
బొగ్గు పొరల్లో 43 మంది కార్మికుల రక్తపు చారికలు
మంటల్లో కాలిపోయి... మాంసం ముద్దలుగా మిగిలిన కార్మికులు
ఇల్లందులో చరిత్రగా మారిన ‘శుక్రవారం’ సెలవు
నేటికీ కన్నీళ్లు పెట్టిస్తున్న 88 ఏండ్ల విషాద గాథ
Singareni:పిట్టల్లా రాలుతున్న కార్మికులు… ఒకరి వెనక ఒకరు పడిపోతున్నారు.. ఏం జరుగుతుందో తెలియదు.. ఒకరు… ఇద్దరు… ముగ్గురు… పది… ఇలా 43 మంది.. ఆదుకునే వారు లేరు… కాపాడేవారు రారు… గనిలో వెలువడిన విషవాయువు ప్రాణాలు తోడేస్తుంటే.. చావు బతుకుల మధ్య గిలగిలా కొట్టుకుంటుకుంటే.. భారీగా ఎగిసిన మంటలు వారిని మాంసపు ముద్దలుగా మార్చాయి.. బంధువులకు కనీసం వారి రూపం కూడా దక్కలేదు… మాంసపు ముద్దలను మూటగట్టి అప్పగించాల్సిన దుస్థితి… అది గుండెల్లో ఎప్పటికీ ఆరని ఒక మహా విషాద గాయం! దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా.. ఆ నల్లని బొగ్గు పొరల వెనుక దాగున్న 43 మంది కార్మికుల రక్తపు చారికలు నేటికీ కన్నీళ్లు పెట్టిస్తూనే ఉన్నాయి.
పల్లెల్లో మొహర్రం అంటే పీర్లతో సందడి… డప్పుల చప్పుళ్లు… భక్తి, ఉత్సాహంతో నిండిన వేడుకలు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి కార్మికుల కుటుంబాలకు మాత్రం మొహర్రం అంటే ఇప్పటికీ గుండెల్లో రగిలే గాయం. సంబరాల రోజునే సంభవించిన ఘోర గని ప్రమాదం 88 ఏళ్లు గడిచినా అక్కడి ప్రజల జ్ఞాపకాల నుంచి చెరిగిపోలేదు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే…? అది బ్రిటిష్ కాలం.. 1938 మార్చి 12వ తేదీ. ఒకవైపు ఊరంతా మొహర్రం సంబరాలలో మునిగి తేలుతోంది. పండుగ వచ్చిందంటే పల్లెల్లో, కోల్ బెల్ట్ ఏరియాలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయి. మొహర్రం వచ్చిందంటే పీరీల రూపంలో భక్తి శ్రద్ధలతో ముస్లింలు, హిందువులు కలిసి వేడుకలు జరుపుకుంటారు. సింగరేణి ప్రాంతంలో కూడా అలాగే పండుగ వేడుకలు సాగుతున్నాయి… భూమి మీద అలా వేడుకలు కొనసాగుతుంటే అట్టడుగున పొరల్లో మాత్రం ఓ విషాద గాయానికి నాంది పడింది…
విషవాయువులు వెలువడి…
ఇల్లందులోని పూసపల్లి సమీపంలోని ‘స్టట్ ఇంక్లైన్’ భూగర్భ గనిలో కార్మికులు వేలాది అడుగుల లోతున పనులు చేసుకుంటున్నారు. దేశానికి వెలుగులు పంచేందుకు నల్లబొగ్గును తవ్వుతున్నారు. ప్రతిరోజు లాగానే ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు… సమయం రాత్రి 10 గంటలు దాటింది… ఒక్కసారిగా గనిలో నుంచి మృత్యువు లాంటి విషవాయువు (Poison Gas) వెలువడింది. ఒకరి తర్వాత ఒకరు పడిపోతున్నారు.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి… ఒకరిని కాపాడేందుకు ఒకరు.. ఊపిరి అందక మరికొందరు అలా పడిపోతున్నారు.
మంటల్లో కాలిపోయి… మాంసం ముద్దలుగా మిగిలి..
ఇలా విషవాయువులు వారి ప్రాణాలు తోడేస్తుంటే తమకు ఏదైనా సాయం అందకపోతుందా…? అని ఎదురుచూస్తున్న కార్మికులపై మరో పిడుగు పడింది.. ఆ గ్యాస్‌కు మంటలు తోడు కావడంతో 43 మంది కార్మికులు భగ్గున కాలిపోయారు. ఆ మృత్యు కుహరంలో 37 మంది పురుషులు, ఆరుగురు మహిళా కార్మికులతో పాటు వారిని రక్షించేందుకు వెళ్లిన జనరల్ మేనేజర్ అండ్రూస్, అధికారులు హుస్సేన్, జాన్ యంగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాద తీవ్రత ఎంత ఘోరంగా ఉందంటే.. మరణించిన వారి దేహాలు తునాతునకలై చెల్లాచెదురుగా పడిపోయాయి. బంధువులకు కనీసం వారి రూపం కూడా దక్కలేదు. మాంసపు ముద్దలను మూటగట్టి అప్పగించారు.
చరిత్రగా మారిన ‘శుక్రవారం’ సెలవు
నాటి ప్రమాదం జరిగింది ఒక శుక్రవారం, పైగా మొహర్రం రోజు. ఈ ఘోర దురంతానికి చలించిపోయిన నాటి బ్రిటిష్ ప్రభుత్వం.. మృతుల జ్ఞాపకార్థం ఇల్లందు ఏరియాలో ప్రతి శుక్రవారం వారంతపు సెలవుగా ప్రకటించింది. సింగరేణి వ్యాప్తంగా మొహర్రం రోజున హాలిడే ఇచ్చే సాంప్రదాయాన్ని తెచ్చింది. నేటికీ సింగరేణిలోని మిగతా అన్ని ఏరియాల్లో ఆదివారం సెలవు ఉంటే.. బొగ్గు పురిటిగడ్డ అయిన ఇల్లందులో మాత్రం ఇప్పటికీ శుక్రవారమే వీక్లీ ఆఫ్. ఇదొక సాధారణ సెలవు కాదు.. నాటి కార్మికుల త్యాగానికి సింగరేణి యాజమాన్యం అర్పిస్తున్న నిత్య నివాళి.
పర్యాటక కేంద్రంగా మార్చాలి..
కోట్ల సంపదను దేశానికి అందించి, ఎందరో కార్మికుల ప్రాణ త్యాగాలపై నిలిచిన ఇల్లందు బొగ్గు బావుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. కార్మికులు మరణించిన స్టట్ ఇంక్లైన్ వద్ద నిర్మించిన స్తూపం, ఆనాటి సమాధులు నేటికీ ఆ విషాదానికి సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని కేవలం ఒక స్మారక చిహ్నంగానే కాకుండా, మైనింగ్ మ్యూజియంగా, ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కార్మిక లోకం కోరుకుంటోంది.
కార్మికుల చెమట, రక్తంతోనే సింగరేణి సామ్రాజ్యం నిర్మించబడింది. ఆ నల్ల బంగారాన్ని వెలికితీసే క్రమంలో అమరులైన ఆ 43 మంది శ్రామిక వీరుల ఆత్మకు ‘నాంది న్యూస్’ ఘన నివాళులు అర్పిస్తోంది.