బొగ్గు గ్యాసిఫికేషన్‌లోకి సింగరేణి అడుగులు
భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
Singareni: బహుముఖంగా విస్తరించాలన్న లక్ష్యంతో బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సింగరేణి సంస్థ వేగంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (Underground Coal Gasification) పైలట్ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు ప్రారంభించింది.
శుక్రవారం సింగరేణి భవన్లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్‌తో జరిగిన సమావేశంలో సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి కోల్ గ్యాసిఫికేషన్‌కు సంబంధించిన ప్రణాళికలను వివరించారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో అమ్మోనియం నైట్రేట్ మెల్ట్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ అధ్యయనం నిర్వహించినట్లు సీఎండీ తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడిపై రాబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వినియోగం, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
కోల్ గ్యాసిఫికేషన్ రంగంలో ఇప్పటికే అమలవుతున్న తాల్చేర్, ఎంసీఎల్–బీహెచ్ఈఎల్, జేఎస్పీఎల్ ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకు ఈ నెలలో సింగరేణి అధికారుల బృందం పర్యటించనుంది. అలాగే భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ అవకాశాలపై సాంకేతిక, ఆర్థిక విశ్లేషణ కొనసాగుతోందని తెలిపారు.
భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం బెల్లంపల్లి, రామగుండం ప్రాంతాల్లోని లోతైన బొగ్గు నిల్వల్లో ఐదు బ్లాక్‌లను గుర్తించినట్లు సీఎండీ వెల్లడించారు. తొలి పైలట్ ప్రాజెక్టును బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్‌లో చేపట్టేందుకు డ్రిల్లింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని, సీఎంఐఎఫ్ఆర్ శాస్త్రవేత్తల సాంకేతిక మార్గదర్శకత్వంలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
సమావేశంలో డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), గౌతమ్ పోట్రు (పర్సనల్ & ఫైనాన్స్), ఈడీ (కోల్ మూవ్మెంట్) బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్ & మార్కెటింగ్) టి. శ్రీనివాస్, జీఎం (పీపీ) జి. దేవేందర్, జీఎం (బిజినెస్ డెవలప్మెంట్) రాందాస్, జీఎం (ఆర్ అండ్ డీ) వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.