ఆరుగురి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో తనపై పోక్సో (POCSO) కేసు పెట్టారన్న కక్షతో రాజ్‌కుమార్ (28) అనే వ్యక్తి ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు, గతంలో తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మలను హతమార్చాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
స్థానిక బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణలతో మే 16న బాధిత బాలిక, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జైలుకెళ్లిన నిందితుడు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. పగతో రగిలిపోయిన అతడు శనివారం తెల్లవారుజామున దైవాలగూడలో భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడిని హత్య చేశాడు. అనంతరం బాలిక ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులైన ముగ్గురిని, బాలికను ఊరి శివారల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు.
ఆరుగురిని హత్య చేసినట్లు స్వయంగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి నిందితుడు పరారయ్యాడు. ఈ ఉదంతంతో గ్రామంతో పాటు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత, విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేశ్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.