మొద‌టి ఆరునెల‌ల జీతం హ‌రీష్ అన్నకే..

సాయం చేసిన వారిని మరిచిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం… కానీ, ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుని తొలి సంపాదనలో సగం తిరిగి సమాజ సేవకు అంకితం చేసిన ఓ యువ ఉద్యోగి కథ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఓ యువ ఉద్యోగి చూపిన కృతజ్ఞతాభావం హరీష్ రావును సైతం భావోద్వేగానికి గురిచేసింది. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ అరుదైన ఘటనపై నాంది న్యూస్‌ ప్రత్యేక కథనం.

సాయం పొంది మరిచిపోయే ఈ కాలంలో, తన జీవితాన్ని మలిచిన వ్యక్తికి కృతజ్ఞతను కార్యరూపంలో చూపిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన మొదటి ఆరు నెలల జీతం అయిన రూ.6 లక్షలను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేపడుతున్న సేవా కార్యక్రమాలకు విరాళంగా అందించి అభినందనలు అందుకున్నాడు.

సిద్ధిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత దంపతుల కుమారుడు రోహిత్ గతంలో ఉన్నత విద్య కోసం విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ సీటు కావాలని హరీష్ రావును ఆశ్రయించాడు. ఆయన చొరవతో రోహిత్‌కు ఇంజినీరింగ్ సీటు లభించింది. అనంతరం చదువును విజయవంతంగా పూర్తి చేసిన రోహిత్, అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలో వార్షిక రూ.12 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించాడు. తన జీవితంలో కీలక మలుపు తిప్పిన ఆ సహాయాన్ని మరువని రోహిత్, శనివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావును కలిసి తన తొలి ఆరు నెలల జీతం అయిన రూ.6 లక్షలను సమాజ సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని విరాళంగా అందజేశాడు.

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, “నా చదువుకు అండగా నిలిచిన హరీష్ అన్నకు కృతజ్ఞతగా, ఆయన చేపడుతున్న ప్రజా సేవలో నా వంతు ఉడుతా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందిస్తున్నాను” అని పేర్కొన్నాడు. రోహిత్ నిర్ణయంతో హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. “సహాయం అందుకున్న తర్వాత కూడా దాన్ని జీవితాంతం గుర్తుంచుకుని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన ఎంతో గొప్పది. రోహిత్ వంటి యువత సమాజానికి ఆదర్శం. అతని ఉదారత నేటి తరానికి స్ఫూర్తిదాయకం” అని కొనియాడారు.

అనంతరం రోహిత్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ ఘటన అక్కడున్న వారిని కూడా కదిలించగా, రోహిత్ చూపిన కృతజ్ఞతాభావం పలువురి ప్రశంసలు అందుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like