మంచిర్యాలలో పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
మంచిర్యాలలో పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్వయంగా పర్యవేక్షించారు.ఇళ్లలో రహస్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో సుమారు 300 మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది ఎన్టీఆర్ నగర్ కాలనీని అర్ధరాత్రి పూర్తిగా చుట్టుముట్టి ఇంటింటికీ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల్లో సుమారు రూ.20 వేల విలువైన అక్రమ మద్యం నిల్వలు, పత్రాలు లేని 166 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక తల్వార్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాత్రివేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించిన 10 మంది యువకులతో పాటు 10 మంది పాత నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి, భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసుల బాధ్యతేనని, అదే సమయంలో ప్రతి పౌరుడు కూడా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.
రోడ్లపై అసాంఘికంగా ప్రవర్తించడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసిన ఆయన, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే యువతను శిక్షించడం కంటే వారిని సరైన మార్గంలో నడిపించడమే పోలీసు శాఖ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైతే పోలీసు శాఖ తరఫున మార్గదర్శకత్వం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కమిషనర్ వెల్లడించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జోన్ డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు, ఇతర ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.