రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి… కాళేశ్వ‌రం నీటిని విడుద‌ల చేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు(BJP State President Ramchander Rao) దుయ్య‌బ‌ట్టారు. రాజకీయాలను పక్కనబెట్టి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం జలాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy)కి ఆయన ఆదివారం లేఖ రాశారు.

ఎన్‌డీఎస్‌ఏ (NDSA) సిఫారసులను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టలేదని, నిపుణులు రెండేళ్లలో పనులు పూర్తి చేయవచ్చని సూచించినా వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ కారణంగా రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో గోదావరి జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికను అడ్డుపెట్టుకుని ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పునరుద్ధరణ బాధ్యతను ఎన్‌డీఎస్‌ఏ కమిటీపై నెట్టేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మార్గదర్శకాలు మాత్రమే అందిస్తుందని, పునరుద్ధరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏ పేరును ప్రస్తావిస్తోందని విమర్శించారు.

మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్‌ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రామచందర్‌రావు పేర్కొన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణను వేగంగా పూర్తి చేసి ఉంటే ఉత్తర తెలంగాణలో 20 నుంచి 25 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి 10 టీఎంసీల తాగునీరు అందించే అవకాశం ఉండేదని తెలిపారు.

విజిలెన్స్ కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలను ఇప్పటికీ ఎందుకు బహిర్గతం చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించిన రామచందర్‌రావు, రాజకీయాలకు అతీతంగా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి రాష్ట్ర ప్రజలకు గోదావరి జలాలను అందుబాటులోకి తీసుకురావాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like