రైతు ఆత్మహత్యాయత్నం.. పోడు భూముల వివాదం ఉద్రిక్తం
పోడు భూముల వివాదం మరో మారు ఉద్రిక్తతకు దారితీసింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లికి చెందిన పోడు రైతు తిరుపతి అటవీశాఖ అధికారులు సాగుకు అడ్డుపడుతున్నారనే మనస్తాపంతో పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు, జడ్పీటీసీల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ అటవీశాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెన్నెల శివారు సర్వే నంబర్లు 671, 672లో సుమారు 1,500 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులు గత 30 ఏళ్లుగా సాగు చేస్తున్నారని, వారికి ప్రభుత్వం పట్టాలు కూడా మంజూరు చేసిందని తెలిపారు. అటవీశాఖ అధికారులు పొలాల్లోకి వెళ్లి సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారుల తీరును ఖండిస్తూ, అవసరమైతే బాధిత రైతులతో కలిసి అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి, శైలేందర్ సింగ్, గోవర్ధన్, శ్రావణ్ కుమార్, రైతు కూలీ సంఘం నాయకులు రత్నం తిరుపతి, బనేష్, శివలింగయ్య, మొహిద్ ఖాన్, గంగారాం, సునీత, బొండయ్య తదితరులు పాల్గొన్నారు.