సార్సాల దాడి కేసులో సంచ‌ల‌న తీర్పు… ఎనిమిది మందికి జైలు

న్యాయం కాస్త ఆలస్యమైనా.. అటవీ అధికారుల పోరాటం ఫలించింది! విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందిపై కర్రలతో దాడి చేసి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘సార్సాల ఘర్షణ’ కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నాటి ఎఫ్ఆర్వో (FRO) చోళ అనితపై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసిన ఘటనకు సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ విచారణల తర్వాత.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు మరో ఏడుగురిని దోషులుగా నిర్ధారిస్తూ న్యాయస్థానం జైలు శిక్ష ఖరారు చేసింది.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో ఏడేళ్ల తర్వాత కీలక తీర్పు వెలువడింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఎనిమిది మంది నిందితులను దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2019 జూన్ 30న కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాలలో అటవీ భూమిలో మొక్కలు నాటేందుకు వెళ్లారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చోళ అనిత నేతృత్వంలోని బృందంపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేయగా, ఎఫ్ఆర్వో అనితతో పాటు పలువురు అటవీ సిబ్బంది గాయపడ్డారు.

ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 39 మందిపై హత్యాయత్నం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, దాడి తదితర అభియోగాలతో కేసులు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు పూర్తిచేసి 2020లో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ, భూరం పోసం, పుల్ల శ్రీకాంత్, కొట్ట మల్లేష్, బొబ్బర శంకర్, రాజశేఖర్, భూరం మల్లేష్, శ్యామలను దోషులుగా తేల్చి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం వెలువడిన ఈ తీర్పుతో అటవీ శాఖ అధికారులకు న్యాయం జరిగిందని అధికారులు, సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న అధికారులపై దాడులను సహించబోమనే స్పష్టమైన సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.ఈ కేసు విచారించిన ఆదిలాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ జిల్లా న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దానియా రుతు తీర్పు వెలువరించారు. ఈ కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్. రమణారెడ్డి ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించగా, ప్రస్తుత కాగజ్ న‌గర్ డీఎస్పీ వాహిదుద్దీన్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించారు. కాగ‌జ్‌న‌గ‌ర్‌ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఈశ్వర్ సింగ్ లు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like