ఉత్త‌ర‌, ద‌క్షిణ రైలు మార్గానికి మూడో లైన్ సిద్ధం

South Central Railway: కాజీపేట- బల్హార్షా మధ్య మూడో లైను మార్గం పూర్త‌య్యింది. 203 కిలోమీట‌ర్లు ఉన్న ఈ రైల్వే లైను ప‌నులు బుధ‌వారంతో పూర్త‌య్యాయి. గురువారం ఆసిఫాబాద్ – సిర్‌పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్ విద్యుదీకరణ పనుల చివరి దశతో పాటు బీబ్రా నదిపై వంతెన నిర్మాణం కూడా పూర్తయిందని, దీంతో ఈ ప్రాజెక్ట్ ముగిసిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ(South Central Railway GM Sanjay Kumar Srivastav) వెల్లడించారు. కాజీపేట – బల్హర్షా మార్గం దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ఒక కీలకమైన రైలు మార్గం కావడంతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ప‌నులు పూర్తి చేసింది.

ఈ మార్గంలో రద్దీని తగ్గించడానికి, రాఘవపురం – మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్ పనులు 2016లో పూర్తయ్యాయి. ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేయడానికి, కాజీపేట – బల్హర్షా మార్గంలోని మిగిలిన 203 కిలోమీటర్ల (తెలంగాణ-159 కి.మీ. మహారాష్ట్ర-44 కి.మీ.) మేర ట్రిప్లింగ్, విద్యుదీకరణ పనులకు 2015-16 సంవత్సరంలో అనుమతి లభించింది. సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే బల్హర్షా స్టేషన్ సమీపంలోని ఒక చిన్న భాగం మినహా, మొత్తం మార్గంలో ట్రిప్లింగ్, విద్యుదీకరణ పూర్తయ్యింది. ఇందులో భాగంగా కొత్తగా వేసిన మూడవ లైన్‌ను బల్హర్షా యార్డ్‌కు అనుసంధానించే పనులు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారిపై రైళ్ల రాక‌పోక‌ల‌ను సులభతరం చేయ‌నుంది. ఈ మార్గంలో థర్మల్ పవర్ ప్లాంట్లు, కర్మాగారాలకు బొగ్గు, సిమెంట్, ముడి పదార్థాల రవాణాపెద్ద ఎత్తున జ‌ర‌గుతుంది. అదే సమయంలో ప్యాసింజర్ రైలు సర్వీసులను పెంచడానికి వీలు కల్పిస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

You might also like