సోషల్ మీడియాలో మోదీ సునామీ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సోషల్ మీడియాలో తన ప్రభావాన్ని చాటుకున్నారు. కేవలం ఒకేఒక్క ఇన్‌స్టాగ్రామ్ వీడియోతో ప్రపంచ రికార్డు సృష్టించారు. విడుదలైన 24 గంటల్లోనే ఆ వీడియో కోట్లాది వ్యూస్ సాధించడంతో పాటు లక్షలాది మంది కొత్త ఫాలోవర్లు మోదీ ఖాతాకు చేరడం విశేషంగా మారింది.

సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతోంది. ఇటీవల ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ఈ వీడియోకు 303 మిలియన్ అంటే 30.3 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. దీంతో 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ప్రముఖ యూట్యూబర్ ఐషో స్పీడ్ వీడియో పేరిట ఉన్న 300 మిలియన్ వ్యూస్ రికార్డును మోదీ వీడియో అధిగమించింది.

ఈ వీడియో ప్రభావంతో మోదీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు కేవలం ఒక్క రోజులోనే సుమారు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరారు. ప్రస్తుతం 10.2 కోట్ల మంది ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు. అర్ధరాత్రి విడుదల చేసిన ఈ వీడియోలో “ఫ్రెండ్స్…” అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ… జెన్-జీ తరానికి దగ్గరయ్యే శైలిలో మాట్లాడారు. దీంతో ఆ వీడియో ఆధారంగా వేలాది మంది నెటిజన్లు రీల్స్, మీమ్స్ రూపొందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా మోదీ అనుసరిస్తున్న కొత్త కమ్యూనికేషన్ శైలికి విశేష స్పందన లభిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ విడుదల చేసిన తొలి వీడియోకు విద్యార్థుల నుంచి విశేష స్పందన రావడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరో వీడియో కూడా విడుదల చేశారు.

ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా మంత్రులందరూ సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉండాలని, ముఖ్యంగా యువతతో ప్రత్యక్షంగా మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం. ఒక్క వీడియోతోనే ప్రపంచ రికార్డు సాధించడం, లక్షలాది మంది కొత్త ఫాలోవర్లను సంపాదించడం… సోషల్ మీడియాలో ప్రధాని మోదీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టం చేసింది. డిజిటల్ వేదికల ద్వారా యువతను చేరుకునే వ్యూహానికి ఇది నిదర్శనంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like