ఆదిలాబాద్ రిమ్స్‌లో భారీ ప్రమాదం… ఇద్దరు శిశువుల మృతి
ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలోని నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ – SNCU) వార్డులో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. వార్డులోని ఎయిర్ కండిషనర్ (ఏసీ)లో ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్ జరిగి పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ దుర్ఘటనలో పొగ పీల్చి ఇచ్చోడ మండలానికి చెందిన ఐదు రోజుల పసికందు మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
అర్ధరాత్రి వేళ ప్రమాదం జరగడంతో చిన్నారుల తల్లిదండ్రులు, వార్డు సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వార్డంతా దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో నవజాత శిశువులకు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది, అక్కడున్న వారు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, సిబ్బంది సహాయంతో చిన్నారులను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ సమయంలో వార్డులోని రెండు గదుల్లో కలిపి 20 మందికి పైగా చిన్నారులు చికిత్స పొందుతున్నారు.
పొగ పీల్చి అస్వస్థతకు గురైన 27 మంది చిన్నారులను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇచ్చోడ ప్రాంతానికి చెందిన ఐదు రోజుల శిశువు పరిస్థితి విషమించి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అదే విధంగా ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరో చిన్నారి సైతం ప్రాణాలు కోల్పోయింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటన ఎలా జరిగిందనే వివరాలను వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు