నేను పరారీలో లేను… ఆరోపణలు అవాస్తవం..
Trainee IPS officer Uday Krishna Reddy:ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పరారీలో లేనని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై పూర్తి విశ్వాసం ఉందని, విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
తనపై తోటి ఐపీఎస్ అధికారి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, మీడియాలో వచ్చిన కథనాల వల్ల తన నానమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెను పరామర్శించేందుకు స్వగ్రామం ప్రకాశం జిల్లా ఊళ్లపాలెంకు వెళ్లానని తెలిపారు. హైదరాబాద్‌లో పోలీసులు వెళ్లిన రెండు చిరునామాలు తాత్కాలికమైనవేనని, తన శాశ్వత చిరునామా అయిన ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. విచారణ అధికారులకు సహకరించేందుకు తానే స్వచ్ఛందంగా హైదరాబాద్‌కు వెళ్తున్నానని వెల్లడించారు.
తాను గ్రామీణ నేపథ్యం నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉంటానని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దాని గురించి మరిన్ని వివరాలు వెల్లడించడం సమంజసం కాదన్నారు. పోలీసు, న్యాయ వ్యవస్థలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, విచారణలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఉదయ్ కృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.