సమాజ సేవకు అంతర్జాతీయ గౌరవం
ఒక మనిషి సంపాదించిన ఆస్తి కాదు… సంపాదించిన ఆశీర్వాదాలే అతని నిజమైన సంపద. రక్తదానంతో ప్రాణాలు కాపాడుతూ… పేదలకు చేయూతనిస్తూ… అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ మూడు దశాబ్దాలుగా మానవతను ఆచరణలో చూపిన సేవామూర్తికి అంతర్జాతీయ గౌరవం వరించింది.
సమాజ సేవను జీవిత లక్ష్యంగా ఎంచుకుని మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న తెలంగాణ యువ సామాజిక సేవకుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. మంచిర్యాల జిల్లా తాండూర్‌కు చెందిన కేశెట్టి సంతోష్ కుమార్ సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించింది.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రానికి చెందిన అభినవ కల్చరల్ సోషల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేశెట్టి సంతోష్ కుమార్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అమెరికాకు చెందిన United American University – For Leadership and Excellence సంస్థ ఆయనకు “డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్” (Honorary Doctorate) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయాలని అధికారికంగా ప్రతిపాదించింది.
ఈ మేరకు 2026 జూలై 17న యూనివర్సిటీ అధికారిక నామినేషన్ సభ్యురాలు డాక్టర్ అభినయ వాసవి ద్వారా మెమొరాండం, ప్రపోజల్‌ను పంపించింది. 30 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయం, విద్యార్థులకు ప్రోత్సాహం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, యువతలో సేవా స్ఫూర్తిని పెంపొందించడం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ పేర్కొంది.
2026 ఆగస్టు 29న పుదుచ్చేరిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది. “కష్టాలు… కన్నీళ్లు… ఎక్కడో… మా చేతులు అక్కడే…” అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ వేలాది మందికి అండగా నిలిచిన సేవామూర్తిగా కేశెట్టి సంతోష్ కుమార్‌కు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.