సింగ‌రేణిలో ఇష్టారాజ్యం…

సింగ‌రేణిలో కొంద‌రు ఆడింది ఆట‌… పాడింది పాట‌గా మారింది… కొంద‌రు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హరిస్తుండ‌గా, అధికారులు చూసీచూడ‌న‌ట్లుగా వ‌దిలేస్తున్నారు. త‌మ దృష్టికి వ‌చ్చినా అధికారులు ఎందుకు వ‌దిలేస్తున్నారు…? ఇందులో మ‌త‌ల‌బు ఏంట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి…

సింగ‌రేణి సంస్థ కొంద‌రికి ఆట‌విడుపు కేంద్రంగా మారింది. విధుల‌కు స‌క్ర‌మంగా హాజ‌రుకాకుండానే ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హరిస్తున్నారు. దీనిని అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు… అస‌లు విష‌యానికి వ‌స్తే బెల్లంప‌ల్లి ఏరియాలోని మాదారం టౌన్‌షిప్ సివిల్ డిపార్ట్‌మెంట్‌లో ఓ పంప్ ఆప‌రేట‌ర్ విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పంప్ ఆప‌రేట‌ర్‌గా కాల‌నీలో నీళ్లను వదిలే బాధ్య‌త కొంద‌రు ప్రైవేటు వ్య‌క్తుల‌కు అప్ప‌గిస్తున్నారు. అది కూడా కొంద‌రు యువ‌కుల‌కు ఆ ప‌నులు అప్ప‌గిస్తుండ‌టంపై ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

చాలా రోజులుగా ఇదే తంతు సాగుతోంది. అయినా, అధికారులు క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. అయితే, కొద్ది రోజుల కింద‌ట ఈ వ్య‌వ‌హారం కాస్తా కొంద‌రు వీడియో తీయ‌డం అధికారుల‌కు పంపించ‌డం జ‌రిగింది. ఆ పంప్ ఆప‌రేట‌ర్ త‌న‌కున్న ప‌లుకుబ‌డితో త‌న‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. అత‌ను టీబీజీకేఎస్ నేత కావ‌డంతో అధికారులు సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

చిన్న చిన్న విష‌యాల‌కే ఛార్జీషీట్లు, మెమోలు ఇచ్చే అధికారులు ఇంత పెద్ద‌గా, ఎన్నో రోజులుగా జ‌రుగుతున్న తంతు ప‌ట్ల చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. నిజంగానే రాజ‌కీయప‌రంగా ఒత్తిడి ఉందా..? మ‌రి ఇంకా ఏదైనా కార‌ణ‌ముందా..? అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా అధికారులు ప‌ట్టించుకుని ఇలాంటి వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.

 

 

You might also like