భారీ వర్షాలకు ఇల్లు కూలి… గృహిణికి తీవ్ర గాయాలు..
మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో తెల్లవారుఝామున ఓ ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో గృహిణి తీవ్రంగా గాయపడగా, ఆమె భర్త, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మంచిర్యాల జిల్లాలో మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన ఆత్రం మాంతు కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా, బుధవారం తెల్లవారుఝామున ఆకస్మికంగా వారి ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో గృహిణి ఆత్రం లక్ష్మి శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. భర్త మాంతు, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి శిథిలాలను తొలగించి క్షతగాత్రులను బయటకు తీసి 108 అంబులెన్స్ ద్వారా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆత్రం లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.