వ‌ర‌ద ముప్పులో ఉమ్మ‌డి ఆదిలాబాద్‌

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతుండగా, వట్టివాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొమరంభీం జిల్లా బెజ్జూర్‌ మండలంలోని ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా సుశ్మీర్ వాగు లో వరదనీరు రావడంతో 12 గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిర్యాని మండలంలోని దుగ్గపూర్ పరిధిలో లో లెవెల్ వంతెనపై నుండి ఉదృతంగా వరద నీరు ప్ర‌వ‌హిస్తుండ‌టంతో రాకపోకలు నిలిచిపోయాయి..

మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, జైపూర్, బీమారం, కోటపల్లి సహా పలు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో అత్యధికంగా జైపూర్ మండలంలో 14.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, వాంకిడి, తీర్యాని, రెబ్బెన తదితర మండలాల్లో వర్షం కొనసాగుతోంది. జిల్లాలోని బెజ్జూర్‌లో 14.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో కడెం పెద్దూర్‌లో 10.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడెం ప్రాజెక్టులోకి 10,692 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 690.875 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.740 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, బోథ్, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, సిరికొండ తదితర మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. స్వర్ణ ప్రాజెక్టులోకీ వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 509 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, నీటి మట్టం 1174.3 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 0.353 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొమురం భీం జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ప్రస్తుతం 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 2, 5, 6 గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి 10,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 239.500 మీటర్లు కాగా ప్రస్తుతం 237.650 మీటర్ల వద్ద కొనసాగుతోంది.

 

You might also like