“కాబోయే ఎమ్మెల్యే నేనే”..

బెల్లంపల్లిలో కొత్త రాజకీయ సమరం

బెల్లంపల్లికి ఎమ్మెల్యేగా అసమర్థుడు వద్దు… సమర్థుడే ముద్దు.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం… ఇదేదో ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారం కాదు… సొంత పార్టీ అది కూడా అధికార పార్టీ నేత చేస్తున్న ప్రచారమిది.. తానే కాబోయే ఎమ్మెల్యేనంటూ ఓ నేత సొంతంగా చెప్పుకుంటుండమే కాకుండా నియోజకవర్గంలోని నేతలందరినీ కూడగట్టుకుంటున్నారు… ఇంతకీ ఎవరా నేత..? ఆయన ప్రచారం వెన ఆంతర్యం ఏంటి..? “నాంది న్యూస్” ప్రత్యేక కథనం..

నిత్యం వివాదాలు, అసంతృప్తులు, రాష్ట్ర స్థాయి వార్తలకు బెల్లంపల్లి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇక్కడ ఏది జరిగినా…? ఎవరేం చేసినా అది సంచలనమే అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే ఖచ్చితంగా అవుననే సమాధానమే వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వ్యతిరేకంగా చాలా మంది నేతలు చేతులు కలుపుతున్నారు. ఇప్పటికిప్పుడు బయట పడకున్నా వారంతా కూటమిగా ఏర్పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ నేత తాను ఎమ్మెల్యే కావాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఎమ్మెల్యే కావాలనుకుని ఆరంగ్రేటం..
అసలు ఎమ్మెల్యే కావాలనే ఆయన రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఆయనే నాతరి స్వామి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాతరి స్వామి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే, అనూహ్యంగా అ టిక్కెట్టు కాస్తా గడ్డం వినోద్ తన్నుకుపోయారు. దీంతో ఆయన ఆశలు అడియాశలు అయ్యాయి. తన కోరికను మనసులో దాచుకుని సైలెంట్గా ఉండిపోయారు. ఎమ్మెల్యే వెం ఉంటూ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంలో పట్టు సాధించారు.

కలిసొస్తున్న ఎమ్మెల్యేపై వ్యతిరేకత…
వినోద్ స్థానికంగా ఉండకపోవడం, కార్యకర్తలు, నేతలను కనీసం పట్టించుకోకపోవడంతో ఇటు ప్రజల్లో అటు పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత్త ఎదురయ్యింది. ఇప్పటికీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలే వినోద్ ఎమ్మెల్యేగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కష్టమంటూ బాహాటంగానే చెబుతున్నారంటే పరిస్థి. అర్థం చేసుకోవచ్చు. బెల్లంపల్లిలో పీఏల పాలన నడుస్తోందంటూ సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో. ఇక బయటపడని వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇక్కడా స్థానికంగా ఉంటానని చెప్పిన ఎమ్మెల్యే వినోద్ ఇక్కడ ఉండకపోవడంతో ఇదంతా జరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలకలం సృష్టిస్తున్న సోషల్ మీడియా పోస్టర్లు
ఇలా వినోద్పై వ్యతిరేకత తనకు అనుకూలంగా మార్చుకునేందుకు నాతరి స్వామి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో భూ వివాదానికి సంబంధించి ఎమ్మెల్యే ఆయనను పక్కకు పెట్టినట్లు సైతం ప్రచారం జరుగుతోంది. ఇలా అన్నింటిని బేరీజు వేసుకున్న నాతరి స్వామి తన టీం ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు. బెల్లంపల్లికి ఎమ్మెల్యేగా అసమర్థుడు వద్దు… సమర్థుడే ముద్దు.. కాబోయే ఎమ్మెల్యే నాతరి స్వామి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. తాను కాబోయే ఎమ్మెల్యేనంటూ నాతరి స్వామి ప్రచారం చేసుకుంటున్నారనే చర్చ సాగుతోంది.

ఇప్పటికే జట్టు కట్టిన అసంతృప్తులు…
అదే సమయంలో నాతరి స్వామి కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, నియోజకవర్గంలో ఉన్న చాలా మంది నేతలను తన వైపు తిప్పుకున్నారు. బెల్లంపల్లి, తాండూరు, కాసిపేట, భీమిని, నెన్నల, వేమనపల్లి ఇలా అన్ని మండలాల్లో ముఖ్య నేతలను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు అందరి దగ్గరి నుంచి ఆయన ఇప్పటికే మద్దతు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలా మంది సీనియర్ నేతలే ఉండటం గమనార్హం.

ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా, అది కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నాతరి స్వామి పావులు కదుపుతూ ముందుకు సాగుతున్నారు. మరి ఆయన ప్రయత్నం ఫలిస్తుందా..? లఏ లేదా..? వేచి చూడాలి మరి..

You might also like