4,634 ఎకరాల్లో పంట నష్టం

ప్రకృతి విపత్తు రైతు జీవితాన్ని మరోసారి పరీక్షకు పెట్టింది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు పంట‌లు ఎండిపోతాయ‌నే దిగులు… ఇక ఇప్పుడేమో మునిగిన పంట‌ల‌ను చూసి క‌న్నీళ్లు.. ఆకాశం నుంచి కురిసిన వాన రైతు ముఖంలో ఆనందం నింపాల్సింది… కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఆ వాన కన్నీటి వరదగా మారింది. పెనుగంగా ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది మంది రైతుల శ్రమ కళ్లముందే నీటిలో కలిసిపోయింది. పత్తి, సోయా, కంది పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతు కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్య‌క్తం చేస్తున్నాయి.

భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగంగా పరివాహక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. బోరజ్, జైనథ్, బేల మండలాల్లో నది ఉప్పొంగి ప్రవహించడంతో వందల ఎకరాల వ్యవసాయ భూములు నీటమునిగాయి. అప్పులు చేసి, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి, సోయా, కంది పంటలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. చాలా చోట్ల పంటలు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 4,634 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తుండగా, బాధిత రైతులు తక్షణమే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వరద తగ్గిన తర్వాత పొలాల్లో మిగిలేది బురద మాత్రమే కాదు… రైతుల చెమటతో పెరిగిన పంటల జ్ఞాపకాలు, భవిష్యత్తుపై అనిశ్చితి కూడా. అందుకే బాధిత రైతులకు వెంటనే ఆర్థిక సాయం, పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

You might also like