కాజీపేట, బల్లార్షా నాలుగో లైన్‌కు గ్రీన్ సిగ్నల్
-తెలంగాణ భవిష్యత్ మార్చనున్న రైల్వే మెగా కారిడార్
-దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు...
-సింగరేణి బొగ్గు రవాణాకు సరికొత్త దారి...
-ఉత్తర–దక్షిణ భారత రైల్వే సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్న నాలుగో లైన్
Kazipet Balharshah Fourth Railway Line : దేశంలోని అత్యంత కీలకమైన రైల్వే కారిడార్లలో ఒకటైన కాజీపేట–బల్హర్షా మార్గం మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్నటి మూడో రైల్వే లైన్ పనులు పూర్తికాగా.. ఇప్పుడు నాలుగో రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సరుకు, ప్రయాణికుల రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
దేశ ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రధాన రైల్వే మార్గాల్లో కాజీపేట–బల్హర్షా సెక్షన్ అత్యంత రద్దీగా ఉండే కారిడార్. ఢిల్లీ, నాగ్‌పూర్, హైదరాబాద్, విజయవాడ, చెన్నై మధ్య ప్రయాణించే అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు భారీ స్థాయిలో గూడ్స్ రైళ్లు కూడా ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా సింగరేణి బొగ్గు, సిమెంట్, ఉక్కు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు ఈ మార్గం ద్వారానే దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నాయి.
పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గంలో మూడో రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టిన రైల్వే శాఖ… ఆ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించి, సర్వేలు, అలైన్మెంట్, డీపీఆర్ తయారీ వంటి ప్రక్రియలను ప్రారంభించింది. ఇందులో సర్వే, డీపీఆర్‌లు పూర్తయినట్లు సమాచారం. ఇక అలైన్మెంట్, భూసేకరణ తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు.
నాలుగో లైన్ పూర్తయితే ఈ కారిడార్‌లో ప్రయాణికుల రైళ్లు, సరుకు రైళ్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారనుంది. ప్రస్తుతం గూడ్స్ రైళ్లకు మార్గం కల్పించేందుకు అనేక ప్రయాణికుల రైళ్లు స్టేషన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అదనపు లైన్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్టుతో అత్యధిక ప్రయోజనం పొందేది సింగరేణి సంస్థే. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతాల గనుల నుంచి వెలువడే బొగ్గు రేకులు ఇకపై మరింత వేగంగా విద్యుత్ కేంద్రాలకు చేరే అవకాశం ఉంటుంది. రేకుల నిరీక్షణ సమయం తగ్గడంతో బొగ్గు రవాణా సామర్థ్యం పెరిగి, సింగరేణి ఆదాయం కూడా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
అంతేకాదు… తెలంగాణలోని పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్ కర్మాగారాలకు ముడి పదార్థాల రవాణా కూడా మరింత వేగవంతం కానుంది. పరిశ్రమల విస్తరణకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుండగా, భవిష్యత్తులో మరిన్ని ప్రయాణికుల రైళ్లను ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం ఏర్పడనుంది.
అయితే ఈ ప్రాజెక్టు అమలులో భూసేకరణ, వంతెనల నిర్మాణం, యార్డుల విస్తరణ, లెవల్ క్రాసింగ్‌ల స్థానంలో ఓవర్‌బ్రిడ్జ్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. అధికారిక అలైన్మెంట్ ఖరారైన తర్వాత జిల్లాల వారీగా భూసేకరణ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాజీపేట–బల్హర్షా మూడో లైన్ పూర్తయిన నేపథ్యంలో… ఇప్పుడు నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్టుపై అందరి దృష్టి నెలకొంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి, సింగరేణి బొగ్గు రవాణాకు, దేశ ఉత్తర–దక్షిణ రైల్వే అనుసంధానానికి మరింత బలం చేకూరనుంది.